కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 8 : అతివేగం, నిద్రమత్తు.. ఇద్దరి ప్రాణాలను బలిగొన్నది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన అఫ్సర్(55), షాకీర్(30) పెండ్లి, ఇతర ఫంక్షన్లకు పందిళ్లు, పూల డెకరేషన్ చేస్తుంటారు. ఆర్డర్లు వచ్చిన సమయంలో నగరానికి వచ్చి పువ్వులు, ఇతర సామగ్రిని తీసుకెళ్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులతో పాటు మరో వ్యక్తి బాబు (టీఎస్ 07 జీకే 1045) కారులో నగరంలోని మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌కు బయలుదేరారు.
మార్గమధ్యలోని మేడ్చల్ పరిధి కండ్లకోయ కేఎస్ ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే.. సుమారు 4.15 గంటల సమయంలో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో షాకీర్, అఫ్సర్ అక్కడికక్కడే మృతిచెందగా.. బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను గాంధీకి, గాయపడిన బాబును చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.