సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/మెహిదీపట్నం :నగర పౌరులు తమ నిజాయితీని చాటుకోవడంలో ముందుంటున్నారు. అందులో కొందరు ఆటో డ్రైవర్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పది రూపాయలు రోడ్డు మీద కన్పిస్తే అటూ ఇటూ చూసి జేబులో వేసుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. కాని అందుకు భిన్నంగా 10 తులాల బంగారు ఆభరణాల పర్సు రోడ్డుపై దొరికినా.. దాన్ని తీసుకునే సమయంలో ఎవరూ చూడకపోయినా.. పరుల సొమ్ము వద్దని, నిజాయితే ముద్దని.. పోలీస్‌స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీని చాటుకొని అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇలా ఒకటి కాదు.. ఇటీవల ప్రయాణీకులు ఆటోలలో మరిచిపోయే విలువైన వస్తువులను, రోడ్డుపై దొరికిన వస్తువులను ఆటో డ్రైవర్లతో పాటు సామాన్యులు వెంటనే స్థానిక పోలీసులకు అప్పగిస్తున్నారు. పోలీసులు సైతం వారి నిజాయితీని గుర్తించి అభినందిస్తున్నారు.
10 తులాల బంగారు ఆభరణాలు అందజేత
మంగళవారం: రోడ్డుపై పడిపోయిన బంగారు అభరణాల బ్యాగును పోలీసులకు అందజేసి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటోడ్రైవర్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్ హాశంనగర్కు చెందిన మీర్జా సుల్తాన్బేగ్ సోమవారం తన భార్య సమీరాబేగంతో కలిసి మెహిదీపట్నం నుంచి రేతిబౌలి మీదుగా తమ బైక్‌పై లంగర్‌హౌస్ వచ్చారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు ఉన్న పర్సును పోగొట్టుకున్నారు. ఆసిఫ్‌నగర్ మురాద్‌నగర్ సయ్యద్ అలీగూడకు చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ జాకీర్‌కు పిల్లర్ నంబర్ 55 వద్ద పర్సు దొరికింది. అందులో రూ. 5 లక్షల విలువ చేసే 10 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు మంగళవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు అందజేశాడు. అప్పటికే బాధితులు అభరణాల పర్సు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారికి సమాచారం అందించి పర్సును అందజేశామని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఆటో డ్రైవర్ సయ్యద్ జకీర్‌ను అదనపు ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డితో కలిసి సన్మానించారు.
పర్సు అప్పగించిన ఆటోడ్రైవర్
సోమవారం: ఆటోలో ప్రయాణించిన ఆర్మీ జవాన్ తిరుమలరావు ఆటో దిగే సమయంలో రూ.10వేల నగదు, ఏటీఎం కార్డులు, ఐడీ కార్డులు ఉన్న తన పర్సు ఆటోలో పడిపోయింది. ఆటో వెళ్లిన అనంతరం అలస్యంగా గుర్తించిన తిరుమలరావు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా.. ఫలితం లేకుండా పోయింది. ఆటోలో పర్సును గుర్తించిన ఆటోడ్రైవర్ హనిఫ్ ఖాన్ వెంటనే పర్సును కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సీఐ నర్సింగరావుకు అందించారు. పర్సులోని ఆధార్‌కార్డు ఆధారంగా తిరుమలరావు ఫోన్ నంబర్‌ను గుర్తించి అందజేశారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్‌ను సీఐ, క్రైమ్ సిబ్బంది సన్మానించారు.
ట్యాబ్ అప్పగించిన స్టాల్ నిర్వాహకుడు
ఆదివారం: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 10వ నంబర్ ప్లాట్ ఫామ్ వద్ద సికిందర్‌కు చెందిన స్టాల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి లెనోవో ట్యాబ్‌ను మరిచిపోయాడు. స్టాల్ నిర్వాహకుడు ట్యాబ్‌ను సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించాడు. రైల్వే పోలీసులు విచారణ చేపట్టి యోగరాజ్ చౌదరిది అని గుర్తించి అతడికి అప్పగించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసులు స్టాల్ నిర్వాహుడిని అభినందించారు.