సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలోని రజకుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రజక సంక్షేమ సమన్వయ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రజకుల కోసం జీవో-9 ప్రకారం, జిల్లా రజక సంక్షేమ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇందులో అధికారులు, సిబ్బంది, రజక సంఘానికి చెందిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లాలోని ఆరు ధోబీఘాట్ల సమస్యలపై చర్చించారు. వాటిలో రెండింటికి మూడు రోజులలో సత్వరమే పరిష్కారం చూపిస్తామని, త్వరలో మిగితా వాటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని రజకుల సమస్యల పరిష్కరించాలని రజక సంక్షేమ సమన్వయ కమిటీ సభ్యులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్డీవో వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, రజక సంఘాల సభ్యులు నర్సింహా, కిషన్, శంకర్ పాల్గొన్నారు.