మణికొండ, ఫిబ్రవరి 8: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమం దేశంలో మరో కాశీ, బద్రీనాథ్లా ఖ్యాతి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సమానతను విశ్వవాప్తం చేయడానికి రామానుజాచార్యులు వెయ్యేండ్ల క్రితం చేసిన సంకల్పం చాలా గొప్పదని, ఆయన ప్రేరణతోనే సమాజంలోని అసమానతలు తొలగిపోతున్నాయని పేర్కొన్నారు. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏడురోజులుగా జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో అమిత్‌షా మంగళవారం పాల్గొన్నారు. ప్రవచన మండపంలో చినజీయర్ స్వామి ఆధర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమసమాజం కోసం రామానుజులు గురువులనే ఎదిరించి నిలబడ్డారని గుర్తుచేశారు. భారత సనాతన ధర్మం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రామానుజులు, శంకరాచార్యులు దేశాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చారని అన్నారు. హైదరాబాద్ అంచున 216 అడుగుల రామానుజుల విగ్రహం ఏర్పాటు చేసి ఈ పవిత్ర భూమిని ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ ప్రేరణ యుగయుగాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సనాతన ధర్మంలోని సత్యాన్ని చాటిచెప్తూ 108 దివ్యక్షేత్రాల్లో పదికోట్ల అష్టాక్షరి పారాయణాలు చేస్తుండటంతో ఈ భూమి పవిత్రంగా మారుతుందని తెలిపారు.
మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్, మణిపూర్, అస్సాంసహా దేశం నలుమూలల్లో ఇప్పటికీ వల్లభ సంప్రదాయం కొనసాగటానికి రామానుజాచార్యుల సందేశమే కారణమని పేర్కొన్నారు. రామానుజాచార్యుల బోధనలు అంబేద్కర్ లాంటి మహానీయులు సమాజానికి తెలిపేందుకు కృషిచేశారని గుర్తుచేశారు. లేజర్‌షోను తిలకించి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని మంగళా శాసనాలను స్వీకరించారు. కార్యక్రమంలో మై హోం అధినేత రామేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.