మణికొండ, ఫిబ్రవరి 7 : రథసప్తమిని పురస్కరించుకుని యాగశాలలో దుష్టగ్రహ బాధ నివారణకు శ్రీ నారసింహ ఇష్టి, జ్ఞానాజ్ఞానాకృత సర్వవిధ పాప నివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి లక్ష్మీనారాయణ మహాక్రతువు, చతుర్వేద పారాయణాలతో పూజలు ప్రారంభించారు. ఈ పూజలను ఐదువేల మంది రుత్వికుల వేద మంత్రాల మధ్య శాస్ర్తోక్తంగా నిర్వహించారు. నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశాలలో 1035 హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీనారాయణ మహాక్రతువు ఘనంగా నిర్వహించారు.
యాగశాల వద్ద గోష్టి పూర్తిచేసిన భక్తులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ సామిజీ మంగళనీరాజనాలను అందజేశారు. అనంతరం ప్రవచన మండపంలో శ్రీ నారసింహ అష్టోత్తర శతనామావళి పూజ, సామూహిక ఆదిత్య పారాయణం, ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు, దేశ,విదేశాల నుంచి వచ్చిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.