సైదాబాద్/మాదన్నపేట్, ఫిబ్రవరి 8 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు. మంగళవారం సైదాబాద్ పోలీస్‌స్టేషన్ ఆధ్వర్యంలో ఓ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడితే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. మత్తు పదార్థాలను విక్రయించే వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలన్నారు. వారిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారని తెలిపారు. కార్యక్రమం బీజేపీ నాయకుడు కొత్తకాపు రవీందర్ రెడ్డి, స్టేషన్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
గంజాయి విక్రయించే వారిపై చర్యలు
గుట్కా, గంజాయి విక్రయించిన వారిపై చర్యలు తీసుకుంటామని మాదన్నపేట సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మంగళవారం మాదన్నపేట మార్కెట్, దోబీఘాట్, కుర్మగూడ, ఉప్పర్‌బస్తీలో కిరాణం, పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. గుట్కా విక్రయిస్తున్న వారిని పట్టుకొని వారివద్ద నుంచి గుట్కాలు, నిషేధిత జర్దాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. నిషేధిత గుట్కాలు, గంజాయి, జర్దాలు అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తునట్లుగా సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించామన్నారు.