రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 7 : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని రూ.50వేల కోట్ల విలువైన 1654.32 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సంబంధిత భూములు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములేనని చెబుతున్న వక్ఫ్ బోర్డుకు కేవలం 4800 చదరపు గజాలు మాత్రమే ఉందని, మిగతా భూములకు సంబంధించి వక్ఫ్ బోర్డుది బోగస్ దావా అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విలువైన ప్రభుత్వ భూములను కాపాడడంలో కీలకంగా వ్యవహరించిన కలెక్టర్ అమయ్‌కుమార్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, గండిపేట తహసీల్దార్ రాజశేఖర్‌లను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది.
నెల రోజుల్లో మూడు కీలక తీర్పులు
జిల్లాలో ప్రభుత్వానికి సంబంధించి నెల రోజుల్లో వరుసగా మూడు తీర్పులు అనుకూలంగా రావడం గమనార్హం. దీంతో సుమారు రూ.65వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వపరమైనవి. ఈ నెల 2న రాయదుర్గంలోని సుమారు రూ.5వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వ భూములని హైకోర్టు తీర్పునిచ్చింది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నం. 46లోని 84.3 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ అమయ్‌కుమార్ ఆధ్వర్యంలో సంబంధిత భూమికి సంబంధించి భూ రికార్డులన్నింటినీ హైకోర్టుకు సమర్పించగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఈ నెల 2న రాయదుర్గంలోని సర్వే నం.46లోని 84.3 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పును వెలువరించింది. అదేవిధంగా డిసెంబర్ 31న గండిపేట మండలం మంచిరేవులలోని రూ.10వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వ భూములని హైకోర్టు స్పష్టం చేసింది.
గండిపేట మండలం మంచిరేవులలోని సర్వే నం.391/1, 391/20లో గల 142 ఎకరాల 39 గుంటల భూమిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. సంబంధిత భూమిని ప్రభుత్వం తమకు కేటాయించిందని 20మంది అసైనీలు హైకోర్టును ఆశ్రయించగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత 142 ఎకరాల భూమి గ్రేహౌండ్స్‌కే చెందుతుందని 2007లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా, గ్రేహౌండ్స్ స్వాధీనం చేసుకుంది. హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందంటూ అసైనీలు 2009లో మళ్లీ పిటిషన్ వేయగా, 2010లో అసైనీలకు కేటాయించాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది.
దీనిపై ప్రభుత్వం వాదనలు వినిపించి, సంబంధిత భూమి ప్రభుత్వానిదేనని, గ్రేహౌండ్స్‌కు కేటాయించినట్లు కోర్టుకు తెలుపగా స్టే విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు సంబంధిత భూములపై కోర్టులో న్యాయ వివాదం కొనసాగుతుండగానే అసైనీల వారసులతో ఇద్దరు వ్యక్తులు ఎకరాకు రూ.40 కోట్ల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి బయానాగా రూ.8లక్షల చొప్పున ఇచ్చి జీపీఏ చేయించుకున్నారు. అయితే అసైనీల వారసుల నుంచి చేసుకున్న జీపీఏను సైతం రద్దు చేసిన రెవెన్యూ అధికారులు, సంబంధిత భూమి ప్రభుత్వానిదేనని పూర్తి నివేదికను హైకోర్టుకు సమర్పించగా, సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా గ్రేహౌండ్స్‌కు కేటాయించిన సంబంధిత భూమిని కబ్జాకు పాల్పడిన 63 మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యాయమే గెలిచింది
గండిపేట మండలం మణికొండ జాగీర్ పరిధిలోని 1654 ఎకరాలకు సంబంధించి న్యాయమే గెలిచింది. వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం సంతోషం. బోగస్ పత్రాలతో భూములు తమవే అన్న వక్ఫ్ బోర్డు వాదనను కోర్టు తప్పుబట్టింది. జిల్లాలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– అమయ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్
2007 నుంచి కొనసాగుతున్న వివాదం
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండజాగీర్లోని 1654.32 ఎకరాల భూమికి సంబంధించి 2007 నుంచి ప్రభుత్వానికి-వక్ఫ్ బోర్డుకు మధ్య వివాదం కొనసాగుతున్నది. హతియాత్ కోర్టు తీర్పు ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా 2006లో మణికొండ జాగీర్‌లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 1654.32 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డువని గెజిట్ జారీ చేశారు. దీని ఆధారంగా 2006లో ఎమ్మెల్సీగా ఉన్న రహమాన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2012లో సంబంధిత భూములు వక్ఫ్ భూములేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం సోమవారం సంబంధిత 1653.32 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఒకవేళ ఈ కేసు తీర్పు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వచ్చినట్లయితే ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు రూ.50 వేల కోట్లు చెల్లించాల్సి ఉండేది. ఈ భూములను 2001లో ఐఎస్బీకి, 2004 తర్వాత ల్యాంకో హిల్స్‌తో పాటు ఉర్దూ యూనివర్సిటీ, విప్రో, టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ, హైదరాబాద్ పబ్లిక్ సర్వీసెస్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితరాలకు అప్పటి రాష్ట్ర ప్రభు త్వం కేటాయించింది.