ఉపాధ్యాయుల కృషికి, సమాజం తోడ్పాటునివ్వడంతో మేడ్చల్ మండలం గౌడవెల్లి జిల్లా పరిషత్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఎదిగింది. జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ చాటుతూ ఆదర్శంగా నిలుస్తోంది. చదువులో ఉత్తమ ఫలితాలను సాధించడంతో పాటు విజ్ఞాన మేళాల్లో తన సత్తాను చాటుతున్నది. జాతీయ వేదికలపై విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతూ శాస్త్రవేత్తలనూ మెప్పిస్తున్నారు. పాఠశాల సాధిస్తున్న ఉత్తమ ఫలితాలతో ఎస్సీఈఆర్టీ గుర్తింపును సాధించడం విశేషం.
గౌడవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జాతీయ స్థాయిలో సులభంగా గుర్తింపు లభించలేదు. దాని వెనుక ఉపాధ్యాయులు, విద్యార్థుల కఠోర శ్రమ, దాతల సహకారం ఉంది. పాఠశాల అభివృద్ధి కోసం దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఉపాధ్యాయులు అహర్నిశలు కష్టపడి విద్యార్థులను తీర్చిదిద్దారు. 100 శాతం ఉత్తీర్ణతతో పాటు మెరుగైన (9-9.5) జీపీఏ పాయింట్లతో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2019 తర్వాత పూర్తిగా ఇంగ్లిష్ మీడియంగా మారిపోయిన ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 415 మంది విద్యార్థులు ఉన్నారు.
జాతీయ స్థాయిలో..
ఇన్స్పైర్, జవహర్లాల్ నెహ్రూ సైన్స్, మ్యాథ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ విజ్ఞాన మేళాలలో రాష్ట్ర స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటారు. 2018లో లక్నోలోని ఎన్బీఆర్ఐ(నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్)లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, అప్పటి కేంద్ర విజ్ఞానశాస్త్ర, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరైన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు డెలిగేట్స్గా పాల్గొని, గౌడవెల్లి గ్రామ పర్యావరణంపై పోస్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అన్వేషణ పేరుతో నగరంలోని విశ్వేశ్వరయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్లో జరిగిన విజ్ఞాన మేళాలలో పాల్గొని 1, 3, 4 స్థానాలను కైవసం చేసుకున్నారు.
ఉత్తమ పాఠశాలగా గుర్తింపు
ఎస్సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆప్ ఎడ్యూకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్) ఎస్ఎల్డీపీ(స్కూల్ లీడర్షిప్ డెవలప్ మెంట్ ప్రోగాం) కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పాఠశాలను గుర్తించింది. విద్యార్థి అభివృద్ధికి ప్రతిభావంతంగా పని చేస్తున్న పాఠశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానించింది. అందులో నుంచి ఉత్తమంగా ఉన్న 60 పాఠశాలలను ఎంపిక చేశారు. ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ స్కూల్ ఇన్ టూ వైబ్రెంట్ లెర్నింగ్ హబ్స్తో ప్రచురించిన పుస్తకంలో గౌడవెల్లి జడ్పీహెచ్ఎస్కు సంబంధించి ‘ఓవర్ ఆల్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ త్రూ సిగ్నిఫిషెయెంట్ ఛేంజస్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ స్కూల్’ పేరుతో కథనం ప్రచురితమైంది.
దాతల సహకారంతో…
గ్రామ పరిధిలోని కృషిహోమం, దుండిగల్ పరిధిలోని స్ఫూర్తి ఫౌండేషన్లది పాఠశాల అభివృద్ధిలో ప్రధాన భూమిక.
జయసూర్య ఫౌండేషన్ నిర్వాహకుడు విజయ్ మద్దూరి డిజిటల్ లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
ముంబయికి చెందిన హైఫై ఫౌండేషన్ బాస్కెట్బాల్ శిక్షణకు పాఠశాలను ఎంపిక చేసుకొంది. సామర్థ్యం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు జెర్సీలు, బూట్లు అందజేశారు. పాఠశాల ఆవరణలో రూ.30 లక్షలతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించారు.
పాఠశాల ప్రతిష్టను పెంచుతాం
దాతలు, ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాఠశాల ప్రతిష్టను మరింత పెంచుతాం. ఉపాధ్యాయుల కృషితో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు. గతంలో మాదరిగానే విద్యార్థుల సాధిస్తున్న విజయాలను కొనసాగిస్తాం. వి ద్యాభివృద్ధికి ప్రజాప్రతినిధులు కూడా తోడ్పాటునందిస్తున్నా రు. విద్యార్థుల పౌష్టికాహారం విషయంలోనూ జాగ్రత్తలు తీ సుకుంటున్నాం. అందరి సహకారంతో పాఠశాలను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాల నిలుపుతాం.