మేడ్చల్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓవైపు చేపల పంపిణీ చేపడుతూనే.. రొయ్యల పెంపకంపైనా దృష్టి సారించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చెరువుల్లో రొయ్యలు వదిలే కార్యక్రమాన్ని మొదటి దశ పూర్తి చేసింది.
తొలి దశలో 5.34 లక్షల రొయ్యలు
మొదటి దశలో భాగంగా జిల్లాలోని నాలుగు చెరువుల్లో 5.34 లక్షల రొయ్య పిల్లల వదిలివేత కార్యక్రమాన్ని మత్స్య శాఖ అధికారులు పూర్తి చేశారు. 2021-22 సంవత్సరానికి గాను సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఎదులాబాద్(1,59,400), శామీర్పేట్ (3,33,850), లక్ష్మాపూర్(19,900), యాద్గార్పల్లి (20,850) చెరువులలో రొయ్య పిల్లలను వంద శాతం సబ్సిడీపై అందజేశారు. ఈ రొయ్య పిల్లలు 6 నెలల్లో విక్రయించేందుకు అనుకూలంగా మారుతాయి. రెండవ దశలో మరిన్ని చెరువులలో రొయ్యలు పెంచే కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని 318 చెరువులలో వంద శాతం సబ్సిడీపై 75 లక్షల చేప పిల్లలను వదిలిన విషయం తెలిసిందే.
మత్స్యకార సంఘాల అభివృద్ధి..
జిల్లాలో 51 మత్స్యకార ప్రాథమిక సహకార సంఘాల్లో 3,352 మంది సభ్యులున్నారు. మత్స్య శాఖ ఆధీనంలో ఉన్న చెరువులను నామమాత్రపు రుసుంతో సహకార సంఘాలకు కౌలుకు ఇస్తున్నారు. ఈ సంఘాలు రంగు చేపలను ఉత్పత్తి చేయడం, చేపల విక్రయ కేంద్రాల ద్వారా చేపలు అమ్మి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి.