సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పారిశుధ్య పనుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, నిరంతరం శానిటేషన్‌పై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ స్థాయి సమావేశంలో మేయర్ పాల్గొని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. శానిటేషన్ పనిచేసే సమయంలో అందరూ సకాలంలో హాజరుకావాలన్నారు. నిర్దేశించిన సమయం, కేటాయింపు ప్రకారంగా పారిశుధ్య కార్మికులు పనిచేసేలా ఏఎంహెచ్ఓలు క్రియాశీలంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల తర్వాత కూడా పారిశుధ్య కార్మికుల పనిపై పర్యవేక్షణ ఉండాలని, కార్మికుల ఖాళీలను నిర్దేశించిన ప్రకారంగా భర్తీ చేయాలని చెప్పారు. జవాన్‌కు కూడా డ్రెస్ కోడ్ ఉండాలని మేయర్ సూచించారు.
నిర్దేశించిన కాలంలో పనులు పూర్తి చేయాలి
ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా తొమ్మిది చోట్ల చేపట్టిన పనులను నిర్దేశించిన కాలంలో పూర్తి చేయాలని మేయర్ ఆదేశించారు. తుకారాంగేట్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. కమ్యూనిటీ హాళ్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయో పరిశీలించాలని, నిర్మించి వదిలిపెడితే సరిపోదన్నారు. ఎస్ఎన్డీపీ పనులకు అంతరాయం లేకుండా భూసేకరణ పనులను ఈనెల15 వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈలు అనిల్ రాజ్, భాసర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి రంజిత్, డీసీలు మోహన్ రెడ్డి, ముకుంద రెడ్డి, వేణుగోపాల్, హరికృష్ణ రాజు, ప్రాజెక్టు ఈఈ గోపాల్ , ఏఏంహెచ్ఓలు పాల్గొన్నారు.
జూన్ నాటికి నాలా పనులు పూర్తవ్వాలి
వచ్చే వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి వరద ముంపు సమస్య తలెత్తకుండా ఎస్ఎన్డీపీ మొదటి దశలో చేపట్టిన పనులన్నింటినీ జూన్‌లోగా పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. హోటల్ మ్యారియట్ నుంచి ఫీవర్ హాస్పిటల్ వరకు జరుగుతున్న హుస్సేన్‌సాగర్ సర్ ప్లస్ నాలా రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను దోమలగూడ వద్ద మేయర్ పరిశీలించారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో టౌన్ ప్లానింగ్, డీసీలు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఎస్ఎన్డీపీ పనులపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏజెన్సీల ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల ప్రారంభం, భూసేకరణ వివరాలను జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఈ సందర్భంగా మేయర్‌కు వివరించారు.