బన్సీలాల్‌పేట్, ఫిబ్రవరి 7 : సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానను సోమవారం ఆయన సందర్శించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు, ఆర్ఎంఓ-1 డాక్టర్ జయకృష్ణ, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ శరత్‌చంద్రారెడ్డి, రామకృష్ణ, ఇతర అధికారులతో కలిసి దవాఖానను పరిశీలించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకొని పరిశీలించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఇటీవల గాంధీ దవాఖాన కోసం కొత్తగా క్యాథ్ ల్యాబ్‌ను, ఎమ్మారై యం త్రాన్ని మంజూ రు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు వాటి పనులను తెలుసుకునేందుకు ద వాఖాన సందర్శించి, వాటిని ఏర్పాటు చేస్తున్న సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
డ్రైనేజీ లైన్, విద్యుత్ వైరింగ్ మార్చాలి..
దవాఖానలో ఉన్న పురాతన డ్రైనేజీ పైపులైన్ల వ్య వస్థ శిథిలావస్థకు చేరిందని, తరచూ సెల్లార్లో మురుగు నీరు నిలిచిపోతున్నదని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు ఈసందర్భంగా శ్రీనివాస్‌కు వివరించారు. విద్యుత్ సరఫరాలో కూడా సమస్యలు వస్తున్నాయని, పలుమార్లు విద్యుత్ ప్రమాదాలు కూడా జరిగాయన్నారు. కోర్టులో కేసులతో దవాఖాన ఆవరణలోని ప్రైవేట్ మందుల దుకాణాల అద్దెలు రావడం లేదని వివరించారు. ఈ సమస్యలను తాను ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్తానని శ్రీనివాస్ తెలిపారు.
స్కానింగ్, ల్యాబ్‌ను త్వరలో..
రోగులకు అవసరమయ్యే స్కానింగ్, క్యాథ్ ల్యాబ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని శ్రీనివాస్ సూచించారు. సెల్లార్‌లోని రేడియాలజీలోని సిటీ, ఎమ్మారై విభాగాలను, కార్డియాలజీ విభాగంలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దవాఖానలోని బయటి రోగుల విభాగాన్ని, ఫార్మసీ విభాగాన్ని సందర్శించిన ఆయన రోగులకు అందించే రోజువారీ మందుల వివరాలు, కాలం చెల్లిన మందులపై అక్కడి సిబ్బందిని అడిగి, రికార్డులను పరిశీలించారు. సెంట్రల్ లాబొరెటరీలో రోగుల రక్త నమూనాల సేకరణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలను, ఓపీ భవనం వెనక వైపు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) భవన నిర్మాణ పనులను పరిశీలించారు.