జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 7: రెండేండ్లుగా కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు పుస్తక పఠనానికి దూరమయ్యారు. ఎంతో మంది చిన్నారులు, చిన్న తరగతుల విద్యార్థులు అక్షరాలను సైతం మర్చిపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ‘రీడ్’ అనే అభ్యసన విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు లోకి తీసుకొస్తున్నది. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు దూరమైన విద్యార్థులలో పఠనాశక్తిని పెంపొందించేందుకు ‘రీడ్’ అభ్యసన విధానాన్ని ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి పీరియడ్‌కు ముందు ఉపాధ్యాయులు బోధించే పాఠాన్ని పది నిముషాల పాటు విద్యార్థులు సామూహికంగా చదవాల్సి ఉంటుంది. ఇలా చదవడం వల్ల వారిలో పోటీతత్వం పెంపొందడంతో పాటు ఆనందంగా చదవడం పట్ల ఆకర్షితులయ్యేందుకు ‘రీడ్.. ఎంజాయ్.. అండ్ డెవలప్’ (ఆర్‌ఈడీ) కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో జనవరి మాసం నుంచి ప్రారంభమైన 100 రోజుల అభ్యాసన కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి (మంగళవారం) నుంచి పకడ్బందీగా అమలు చేయనున్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు తరగతిలో ఉపాధ్యాయు లు తాము బోధించే పాఠాన్ని వారికి తెలియచేయడంతో పాటు తరగతి గదిలో ‘ఒకరితో ఆ పాఠ్యాంశాన్ని చదివిస్తూ.. విద్యార్థులు ఎవరికి వారు ఆ అంశాలను చది వేలా సాధన చేయించాలి. పది నిముషాల తరువాత ఉపాధ్యాయుడు సదరు పాఠాన్ని విద్యార్థులకు విశదీకరించి బోధించాలి’ అన్నది రీడ్ ఉద్దేశం. ఈ మేరకు సో మవారం ఖైరతాబాద్ జోన్‌లోని యూసుఫ్‌గూడ, బోరబండ, శ్రీరాంనగర్, జవహర్‌నగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జిల్లా ఉప విద్యాధికారి చిరంజీవి జూమ్ సమావేశం నిర్వహించారు.
పాఠశాలకు దూరమైన వి ద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు సా మూహిక అభ్యాసనతో తమను తాము తర్ఫీదు చేసుకోవడం కోసం ఈ ‘రీడ్’ అభ్యాసన విధానాన్ని అమలు చే స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా కొవిడ్ నేపథ్యం లో పాఠశాలలకు దూరమైన విద్యార్థులకు సిలబస్ కుదిం చి ఎఫ్ఏ-1, ఎస్ఏ-1 పరీక్షలు నిర్వహించిన అధికారు లు విద్యార్థుల్లో గణనీయమైన మార్పులు తెచ్చేందుకు ఈ నూతన అభ్యాసన విధానాన్ని అమలుచేస్తున్నారు.
అన్ని తరగతులకు ‘రీడ్’ అమలు…
ఈ విద్యా సంవత్సరం ముగిసే సరికి విద్యార్థులు వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా చదవుతూ.. రాయగలిగేందుకు ఈ ‘రీడ్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో 1 నుంచి 10వ తరగతులకు ప్రతి సబ్జెక్టుకు ముందు 10 నిముషాలు విద్యార్థులే ఆ పాఠాన్ని చదవాలి. ఈ మేరకు జోన్‌లోని అన్ని పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి ‘రీడ్’ కార్యక్రమం అమలును పరిశీలిస్తున్నాము. ఈ ఏడాది పరీక్షలకు సన్నద్ధమయ్యే వరకు విద్యార్థులకు ‘చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు’ అన్న విధానంతో పాఠాలు బోధించనున్నాము.
– చిరంజీవి, జిల్లా ఉప విద్యాధికారి, ఖైరతాబాద్ జోన్