నేరేడ్మెట్, ఫిబ్రవరి 7 : నల్లమందు విక్రయిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన (1.5 కిలోలు) నల్లమందు, ఓ ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రక్షితకృష్ణమూర్తి వెల్లడించారు.
రాజస్తాన్ పునాస గ్రామానికి చెందిన మంగీలాల్, శివే మందిర్ గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ స్నేహితులు. ఇద్దరు కలిసి బోడుప్పల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. అయితే గత రెండేండ్ల కిందట రాజస్తాన్‌కు చెందిన రాహుల్ నగరానికి వచ్చి నల్లమందు విక్రయానికి వీరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి వీట్ కమాన్ వద్ద నల్లమందును విక్రయించేందుకు యాక్టివా వాహనంపై వెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విచారించగా నల్లమందు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు రాహుల్ పరారీలో ఉన్నాడు.