సికింద్రాబాద్, ఫిబ్రవరి 7: కొన్నేండ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న చెత్త సేకరించే కార్మికులు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు నూతన కాంట్రాక్ట్ విధానాన్ని తెరపైకి తీసుకురావడంతో కార్మికులకు చిక్కులు వచ్చి పడ్డాయి. కాంట్రాక్ట్ విధానంతో పాత కార్మికులకు, కాంట్రాక్ట్ సంస్థకు మధ్య వాగ్వాదం నడుస్తుంది. రెండు రోజులుగా చెత్తను సేకరించకుండా కార్మికులు స్వచ్ఛ ఆటోను అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కార్మికులు రెండు రోజుల క్రితం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం బోర్డు కార్యాలయంలో అధికారులతో పాటు ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిలతో కలిసి మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు.
తొలుత అంతర్గతంగా సమావేశమైన మంత్రి మల్లారెడ్డి అనంతరం కార్మికులతో కలిసి భేటీ అయ్యారు. పాత వాహనాలను చెత్త సేకరణకు వినియోగించే అవకాశం లేదని, అదేవిధంగా ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయాల్సిన అవసరం కార్మికులకు లేదని స్పష్టం చేశారు. క్లీన్ కంటోన్మెంట్ దిశగా బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న 200 మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని కార్మికులు నూతన వాహనాలను సమకూర్చుకోవాలని చెప్పారు. ప్రధానంగా ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధ్దతిన బోయిన్పల్లి సర్కిల్లో 15 కొత్త వాహనాలతో చెత్త సేకరణ జరుగుతుందని, బోర్డు పరిధిలో రెండు వార్డుల్లో ఫైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న తరుణంలో మిగతా ఆరు వార్డుల్లో చెత్త సేకరణకు కార్మికులు నూతన వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. బోయిన్పల్లి సర్కిల్లో ఉన్న వాహనాలను పాతవారే నడుపుకునేలా అధికారులు అనుమతి ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
వాహనాల కొనుగోలుకు ఇబ్బందులు ఉన్నాయని మంత్రికి వివరించడంతో సుమారు 60 వాహనాలను తాను ఇప్పిస్తానన్నారు. దీంతో కార్మికులు సమస్య పరిష్కారం కావడంతో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు అధికారులు దేవేందర్, ఆఫ్జల్, మహేందర్‌తో పాటు వికాస్ మంచ్ సభ్యులు ఎబెల్, సంకి రవీందర్,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.