సకలజనులకు సమానత్వాన్ని బోధించిన మూర్తి..వ్యక్తికన్నా సమాజహితమే ప్రధానమన్న దార్శనికుడు.. దేవుడి ముందు అంతా సమానమేనని లోకానికి చాటిచెప్పిన దాయార్ద్ర హృదయుడు జగద్గురు భగవద్రామానుజాచార్యులు. ఆయన స్ఫూర్తిని తరతరాలకు అందించే కాంక్షతో ముచ్చింతల్ శ్రీరామనగరంలో జరుగుతున్న సహస్రాబ్ది ఉత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. ఐదోరోజు ఆదివారం దివ్యక్షేత్రానికి భక్తజనం పోటెత్తడంతో భవ్యమందిర ప్రాంగణం కళకళలాడింది. శ్రీ లక్ష్మీనారాయణుడి మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుండగా, ప్రతినిత్యం కోటి అష్టాక్షరీ మహామంత్ర జపం ప్రారంభమైంది. 1035 హోమగుండాలలో నిర్వహించే పూజాది క్రతువులను వేదపండితులు వివరించారు. దివ్యక్షేత్రంలో అతిసుందరంగా నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శించుకుంటే ప్రపంచంలోని అన్ని ఆలయాలను దర్శించిన పుణ్యఫలం లభించినట్లేనని చినజీయర్‌స్వామి ప్రవచించారు.
మణికొండ, ఫిబ్రవరి 6 : శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం దీపకాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ భక్తులతో భవ్య మందిర ప్రాంగణం కళకళలాడుతున్నది. ఆదివారం లక్ష్మీనారాయణ సహస్ర కుండలి మహాయజ్ఞంలో వేలాది మంది భక్తులు పాల్గొని మంత్ర జపం, ఆహుతి, తర్పణం, పుష్పార్చన, తదీయారాధన కార్యక్రమాలల్లో స్వామివారి ప్రవచనాలను ఆలకించారు.
త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆరంభమైన ఈ పూజలో అహోబిల రామానుజ జీయర్‌స్వామి, దేవనాథ రామానుజ జీయర్‌స్వామి, రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, అష్టాక్షరీ రామానుజ జీయర్‌స్వామి, వ్రతధార రామానుజుల స్వాములు పాల్గొని భక్తులకు ఆశీర్వచనాలను అందించారు.1035 హోమ గుండాలలో నిర్వహించే కార్యక్రమాలను గురించి ఆదివారం వేదపండితులు భక్తులకు వివరించారు. మంత్ర జపం లక్ష్మీనారాయణ సహస్ర కుండలి మహాయజ్ఞంలో ప్రతి రోజు ఒక కోటి అష్టాక్షరీ మహామంత్ర జపం గంటన్నరపాటు చినజీయర్ స్వామి వాకితో మంత్ర అనుష్టానం, ఇది ఒక అద్భుతమైన అనుభవంగా భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పవిత్రమైన యాగశాలలో అతిశక్తివంతమైన అష్టాక్షరీ మంత్రాన్ని నిశ్శబ్దంగా మనసులో స్మరిస్తూ భక్తులు శారీరకంగా, మానసికంగా తమని తాము ధృఢపరుచుకుంటూ భక్తిలో లీనమైయ్యారు. ఈ సందర్భంగా పది లక్షల ద్రవ్యాలను రుత్వికులు 1035 కుండాలలో ఆహుతి చేశారు.
పదో వంతు అంటే ఒక లక్ష తర్పణాలు చేసి, అందులో మరో పదో వంతు 10వేల నామాలతో పుష్పార్చన చేశారు. ఆదివారం ప్రవచన మండపంలో అనేక అవతారాలలో దర్శనమిచ్చే భగవంతుడికి అష్టోత్తర శత నామ పూజ, పుష్పాలతో వేదపండితులు నిర్వహించారు. వేయి మందికి తదీయారాధన అంటే ప్రసాద వితరణ చేయడంతో పాటు తదీయారాధనలో ప్రతి రోజు లక్షలాది మందికి భోజన సౌలభ్యం కల్పించడంపై ఆరాధించారు. అనంతరం సాయంకాల వేళ ప్రవచన మండలంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త బృందాలతో నృత్య నాట్యాలు భక్తులను అలరించాయి. నిత్య పూర్ణాహుతితో ఐదో రోజు పూజలు ముగిశాయి.
యాగశాలల్లో కొనసాగిన క్రతువు…
సమతామూర్తి దివ్యక్షేత్రంలోని 1035 యాగశాలల్లో ఆదివారం అష్టాక్షరీ మహామంత్ర పూజలతో పాటు మహయజ్ఞం, మంత్ర అనుష్టాన కార్యక్రమాలను వేదపండితులు, రుత్వికులు మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. సుమారు 5వేల మంది వేదపండితులు పాల్గొని యజ్ఞాలను కొనసాగించారు.
108 దివ్యక్షేత్రాలు దర్శిస్తే…ప్రపంచాన్ని చుట్టేసినట్లే
సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్యదేశాలను దర్శనం చేసుకుంటే యావత్తు ప్రపంచంలోని అన్ని దేవాలయాలను దర్శించి పుణ్యఫలం లభించినట్లేనని చినజీయర్‌స్వామిజీ ప్రవచించారు. సహస్ర్తాబ్ది ఐదో రోజు పూజా కార్యక్రమాలల్లో ఆయన యాగశాలలో పాల్గొన్న భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామారాధన కార్యక్రమాన్ని ప్రవచన మండలంలో భక్తులతో కలిసి ఆయన పుష్పార్చనలు చేయించారు.
శ్రీరామనగరానికి పోటెత్తిన భక్తులు
ఐదురోజులుగా సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్విరామంగా జరుగుతున్న సమారోహ ఉత్సవాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. జంటనగరాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు చిన జీయర్‌స్వామి ఆశీర్వచనాలను అందించారు. అంతకుముందు 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని చూసి భక్తులు ఆనంద పునీతులైయ్యారు.
చిన్నారులకు శ్లోకాల పోటీలు
సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం ప్రవచన మండపంలో భగవద్గీత శ్లోకాల పోటీలు చినజీయర్ స్వామిజీ పర్యవేక్షణలో ఆద్యంతం ఆసక్తికరంగా జరిగాయి. శ్రీకృష్ణుడు భాగవతంలో సూచించిన అంశాలపై శాస్త్రీయ సంస్కృతంగా విశ్లేషిస్తూ, అనువధిస్తూ ప్రశ్నలు సంధిస్తే చిన్నారులు పూర్తిశ్లోకాలను చెప్పడం అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జీయర్ స్వామిజీ చిన్నారులను అభినందిస్తూ బహుమతులను అందజేశారు.
భారత సంస్కృతి..ప్రపంచానికే స్ఫూర్తి
శంషాబాద్ ముచ్చింతల్
శ్రీరామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని దర్శించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
భిన్నమతాలు, భాషలకు మన సంస్కృతికి చిహ్నమే రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరానికి ఆయన ఆదివారం పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి దర్శించారు. ఈ సందర్బంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ నీ దైవాన్ని ఆరాధించు…ఎదుటి మతాన్ని గౌరవించు అన్న సంప్రాదాయం, సంస్కృతి ఒక్క హిందుజాతిలోనే ఉందని అన్నారు. విప్లవ గురువుగా చిన జీయర్ స్వామిజీ కన్పిస్తున్నారని అభివర్ణించారు. అణగారిని కులాలకు అండగా ఉంటూ సమతాస్ఫూర్తిని చాటుతూ అందరినీ ఒకేలా చూడటం రామానుజాచార్యులకే దక్కిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయడం ఆనందంగా ఉందన్నారు.
సువర్ణయుగానికి ఆరంభం
జగద్గురు గోవిందగిరి మహారాజ్
శ్రీరామనగరాన్ని దర్శించిన జగద్గురువులు
హైందవ జాతి అంధకారంలో ఉన్న సమయంలో సమతామూర్తిని నెలకొల్పి జాతిలో నూతనోత్తేజాన్ని నింపి, సువర్ణయుగానికి దారి చూపేందుకు శ్రీరామానుజాచార్యులు అవతరించాడని జగద్గురు గోవిందగిరి మహారాజ్ స్పష్టం చేశారు. సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని ఆదివారం రాజస్థాన్ పుష్కర్ నుంచి విచ్చేసిన జగద్గురు రామచంద్రాచార్య స్వామిజీ మహారాజ్, బీహార్ నుంచి విచ్చేసిన జగద్గురు శ్రీ స్వామి వెంకటేశ ప్రపన్నాచార్యు జీ మహరాజ్‌తో కలిసి దివ్యక్షేత్రాన్ని దర్శించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలు, ఆళ్వార్లు, 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని తిలకించారు. ఈ సందర్భంగా గోవిందగిరి మహారాజ్ మాట్లాడుతూ భాగ్యనగరంలో భగవాన్ రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించి, సువర్ణయుగానికి మార్గదర్శనం చేశారని అభివర్ణించారు.త్రిదండి చినజీయర్ స్వామి భావితరాలకు ఆదర్శనీయుడని కొనియాడారు. అనంతరం ఐసీఎఫ్ఏఐ యూనివర్సీటీ వైస్ చాన్స్‌లర్ డా.జగన్నాథన్ పట్నాయక్, మాజీ డీజీపీ అరవింద్‌రావు
మాట్లాడారు.
ముగ్గులో స్వరూపం
పరమాత్ముడి సేవకై సుమారు 300 కిలోమీటర్ల దూరం మంచిర్యాల జిల్లా నుంచి నుంచి శ్రీరామానుజాచార్యుల దివ్యక్షేతానికి వచ్చిన స్వరూప స్వచ్ఛసేవలో తనవంతుగా శ్రమిస్తున్నారు. ప్రతి రోజు యాగశాలలో 15 నుంచి 20 ముగ్గులను బియ్యపు పిండితో హోమగుండాలకు వేసి సంస్కృతీ సంప్రదాయాలను సూచిస్తోంది. ఆమె వేసే ప్రతి ముగ్గులో స్వామివారి ఆశీస్సులను కనబర్చుతూ నిరాడంబరంగా స్వచ్ఛమైన భక్తితో సేవను చేస్తుండడాన్ని పండితులు అభినందిస్తున్నారు.
2 గంటలు అనుమతి
పదిరోజులపాటు జరిగే ఉత్సవాల అనంతరం భక్తులను సమతామూర్తి క్షేత్రం లోపలికి అనుమతించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రముఖుల రాకపోకలప్పుడు అనుమతించకుండా మిగతా రోజుల్లో నిత్యం 2గంటలపాటు భక్తులను అనుమతించనున్నారు. సోమ, మంగళవారాల్లో వీఐపీలు వస్తున్నందున ఉదయం పూటే అనుమతించాలని యోచిస్తున్నట్లు సమాచారం.