సిటీబ్యూరో, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ మహానగరంలో పచ్చందాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే గ్రేటర్లో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల స్వయంగా విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2011తో పోలిస్తే నగరంలో ఆటవీ విస్తీర్ణం (పచ్చదనం) 147 శాతం పెరిగిందని అధికారులు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న పార్కులే ఇందుకు ప్రధాన కారణమని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
అందుబాటులోకి ప్రాణవాయువు పార్కులు
నగరవాసులకు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించడంలో పట్టణ పారుల ముఖ్యపాత్రను పోషిస్తున్నాయి. ఇందులోభాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో అటవీశాఖతో కలిసి జీహెచ్ఎంసీ పట్టణ అటవీ పార్కులను తీర్చిదిద్దుతున్నది. ఈ మేరకు గాజులరామారం, సూరారం, బౌరంపేట్ పరిధిలోని 60 ఎకరాల్లో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పారులను ఏర్పాటు చేసింది. ఇందులో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్, వాష్ రూమ్స్, యోగా షెడ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెండు ఓపెన్ క్లాస్ రూంలు, పిక్నిక్ ఏరియాను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పార్కులను ఇటీవలే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
వైవిధ్యంగా చిన్నారుల పార్కు..
అల్వాల్‌లో చిన్నారుల కోసం అధికారులు థీమ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. 5 నుంచి 12 సంవత్సరాల లోపు చిన్నారులను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందిస్తున్నారు. జిరాఫీ పై నుంచి జారడం, పండ్ల ఆకారంలో బెంచీలు, జంతువుల డస్ట్బిన్లు, కనువిందు చేసే పెయింటింగ్స్‌తో ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. త్వరలో ఈ పార్కును అందుబాటులోకి తీసుకువస్తామని కూకట్పల్లి జోన్ కమిషనర్ మమత తెలిపారు.
55 థీమ్ పార్కులు..
జీహెచ్ఎంసీ అదనంగా మరో 56 థీమ్ పార్కులను 12,89,337 చదరపు గజాల్లో ఏర్పాటు చేస్తున్నది. ఇందులో స్పోర్ట్స్, మల్టీ జనరేషన్, ఉమెన్, తెలంగాణ స్ఫూర్తి పార్కు పనులను అధికారులు ప్రారంభించారు. తెలంగాణ స్ఫూర్తి, మల్టీ జనరేషన్ పార్, ఉమెన్ పార్, చిల్డ్రన్ థీమ్ పార్కు పనులు పురోగతిలో ఉండగా.. గాజులరామారంలో టీఎస్ఐఐసీ కాలనీలో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ థీమ్ పార్కు పనులు పూర్తి కాగా ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు.