1989లో ఉపాధ్యాయురాలిగా వరంగల్‌లో సుధారాణి ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. 2009లో మోడల్ ఆలియా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌గా చేరింది. ఆ సమయంలో పాఠశాల దుస్థితిని చూసి తన సొంత నిధులతో లక్షల రూపాయలు వెచ్చించి మరుగుదొడ్లు, ప్లే గ్రౌండ్‌ని ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ సహాయంతో చిన్నారులకు తాగునీటి ట్యాంకును ఏర్పాటు చేసింది. ఇంతటితో ఆగకుండా అనాథ విద్యార్థులను ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసింది. 2018లో మహబూబియా ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించింది.
ఈ పాఠశాలలో భవనం లీకేజీలకు మరమ్మతులు చేయించింది. రోటరీ క్లబ్ సహాయంతో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి, ప్రార్థనా వేదిక, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించింది. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న 290 మంది విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలను మన ఊరు మన బడి కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మరింత అభివృద్ధి చేస్తున్నది. 1908లో ప్రారంభమైన ఈ పాఠశాలలో సర్కారు నిర్ణయంతో ఆంగ్ల మాధ్యమం రావడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగనున్నది.
ఆ ఉపాధ్యాయురాలు ఎక్కడ పని చేసినా..
ఆ పాఠశాలకే వన్నె తెస్తారు. విధుల్లో తనకు ఉన్న అంకితభావంతో పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తారు. వృత్తిని బాధ్యతగా స్వీకరిస్తూ అనాథలు, పేద విద్యార్థులకు ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. ఉపాధ్యాయురాలిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆమె పని చేసిన ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలా అని ఆమె పనిచేసేది ఏ మారుమూల ప్రాంతమని అనుకుంటే పొరపాటే. నగరం నడిబొడ్డున ఉన్న బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రీ ప్రాంతంలోని మోడల్ ఆలియా ప్రాథమికోన్నత పాఠశాల, ప్రభుత్వ మహబూబియా బాలికల ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఆ పాఠశాలలకు ఆమె ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించి తనదైన ముద్ర వేశారు. ఆ ప్రధానోపాధ్యాయురాలి పేరు సుధారాణి.
పేదలు ఉన్నతంగా ఎదగాలి
పేద విద్యార్థులకు నిలయాలు అయిన ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మరింత భరోసా పెరిగింది. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య ప్రభుత్వ పాఠశాలలో ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకున్నారు. పేద విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో మా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాను.
– సుధారాణి, ప్రధానోపాధ్యాయురాలు , మహబూబియా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల