మేడ్చల్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులలో మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆధునిక భోజనశాలల నిర్మాణంపై సర్కారు దృష్టి సారించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నది. మౌలిక వసతులు కల్పిస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ఇందులో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ బడులలో ఆధునిక భోజనశాలల నిర్మాణాలు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 505 ప్రభుత్వ బడులలో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. సన్న బియ్యంతో వండిన అన్నం, కూర, సాంబర్తో పాటు రోజు తప్పించి రోజు గుడ్డును అందిస్తారు. ప్రభుత్వ బడులలో 96,608 విద్యార్థులు ఉండగా, ఇందులో 75 శాతం విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరి కోసం ప్రభుత్వ నిధులతో పాటు దాతలు ఇచ్చిన విరాళాలతో మోడ్రన్ డైనింగ్ హాళ్లు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సౌకర్యవంతంగా కూర్చుని తినే విధంగా మోడ్రన్ డైనింగ్ హాళ్లు రూపుదిద్దుకున్నాయి.
డైనింగ్ హాల్ బాగుంది డైనింగ్ హాల్ నిర్మాణంతో విద్యార్థులకు
సౌకర్యంగా మారింది. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నది. విద్యార్థులు కూర్చుని భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. కొందరు దాతలు ఫర్నిచర్‌ను విరాళంగా అందించారు.
– బాలేశ్, ప్రధానోపాధ్యాయుడు, డబిల్పూర్ ఉన్నత పాఠశాల
దాతలు సహకరించారు శ్రీరంగవరం
పాఠశాల మోడ్రన్ డైనింగ్‌హాల్ నిర్మాణాన్ని దాతల సహకారంతో పూర్తి చేశాం. భవన నిర్మాణంతో పాటు ఫర్నిచర్‌కు మాధవరెడ్డి, మహిపాల్‌రెడ్డిలు వారి తండ్రి వీరారెడ్డి స్మారకార్థం రూ. 18 లక్షలు ఖర్చు చేశారు. దీంతో విద్యార్థులకు సౌకర్యంగా మారింది.
– విజయ్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, శ్రీరంగవరం ఉన్నత పాఠశాల