పహాడీషరీఫ్, ఫిబ్రవరి 6 : మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ఇస్లామిక్ సోషల్ సర్వీస్ అనే స్వచ్ఛంద సంస్థ కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని దానం చేసి తమ సేవా భావాన్ని చాటుకున్నది. రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వాది హుదాలో ఇంటింటికీ తాగునీరు అందించేందుకు 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించాలని అధికారులు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా ట్యాంక్ నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు ఇస్లామిక్ సోషల్ సర్వీసెస్ ముందుకు వచ్చింది. ట్యాంక్ నిర్మాణానికి రెండువేల గజాల స్థలాన్ని ఇచ్చారు. పనులు పూర్తికావడంతో ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నాయి. అదేవిధంగా విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం కోసం ఐదు కోట్ల విలువగల మూడు వేల గజాల స్థలాన్ని కూడా ఉచితంగా ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం ముందుకు వచ్చి స్థలం ఇచ్చిన ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రజా శ్రేయస్సుకు ముందుంటాం
ప్రజలకు సేవ చేసేందుకే తమ సంస్థ ఏర్పాటైంది. సొసైటీ సభ్యుల ఆమోదంతో స్థలం ఇచ్చాం. స్థలం కోట్లాది రూపాయల విలువైనది. అయినా ప్రజా సేవే ముఖ్యంగా భావిస్తున్నాం. పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే ఉద్దేశంతో వాది హుదాలోనే ముస్లిం జనరల్ దవాఖానను నిర్మించి వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం.
– రషాదుద్దీన్, ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ సెక్రటరీ, వాది హుదా