సుల్తాన్‌బజార్, ఫిబ్రవరి 6 : గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీలో సీనియారిటీ ప్రకారం ఉద్యోగులకు మార్చిలోగా ఇండ్ల స్థలాలను అందించేలా కృషి చేస్తున్నట్లు భాగ్యనగర్ టీఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ గౌడ్ అన్నారు. దశాబ్ద కాలంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాలను ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగుల స్థలాల సమస్యకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండాలని, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆదివారం చండీ హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం, శాంతి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌పై ఎంతో నమ్మకం ఉందని, మార్చిలోగా ఉద్యోగులకు స్థలాలను కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, సొసైటీ ప్రతినిధులతో కూడిన బృందం త్వరలో సీఎంను కలిసి ఇండ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి జి.మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు జి.రాజేశ్వర్‌రావు, కోశాధికారి ఎ.శ్రీనివాస్, సొసైటీ డైరెక్టర్లు ఎస్.ప్రభాకర్‌రెడ్డి,ఎం.శ్రీనివాస్‌రావు, ఎస్.సంధ్యారాణి, సాధిక్, కేశ్యానాయక్, పి.శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.