జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 6 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఈనెల 17న యూసుఫ్‌గూడలో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఆదివారం యూసుఫ్‌గూడ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్స్‌లో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి వేదిక ఏర్పాటుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్రం సుసంపన్నంగా, సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అనితర సాధ్యమైన కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల మోములో సంతోషాన్ని నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, దేదీప్య విజయ్, సంగీతాయాదవ్, సినీ ఆర్ట్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.