జపాల ప్రాముఖ్యాన్ని వివరించిన త్రిదండి చినజీయర్ స్వామి
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ/మణికొండ : విజయప్రాప్తికి విశ్వక్సేనేష్టి.. విద్యాప్రాప్తికి హయగ్రీవష్టి.. అష్టాక్షరి మహామంత్ర జపాలు.. శ్రీనివాసుడి అష్టోత్తర శతనామ పూజ.. లక్ష్మీనారాయణుడి మహాయజ్ఞంతో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ శ్రీరామనగరం సంరంభమవుతోంది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా నాల్గోరోజు శనివారం సమతామూర్తి 216 అడుగుల రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం యజ్ఞహోమాల్లో పాల్గొన్నారు. ‘విష్ణు అంటే సర్వస్వం, మంచిని స్వీకరిస్తే జగమంతా విష్ణుతత్వమే సాధ్యం. శ్రీమన్నారాయుణుడే ఈ దివ్యక్షేత్రాన్ని మానవుడి రూపంలో భక్తజనులకు ఆశీస్సులు అందిస్తున్నారు’ అని చినజీయర్‌స్వామి ప్రబోధించారు. ప్రవచన మండపంలో ఆయా రాష్ర్టాల నుంచి విచ్చేసిన వేదపండితుల పారాయణం, ప్రవచన మంగళనీరాజనాలను భక్తులకు అందజేశారు. కాగా, మహానగర కీర్తిలో సమతామూర్తి ప్రతిమ కిరీటంగా నిలువనుంది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లనుంది.
శ్రీ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది
సమారోహ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన శనివారం
శ్రీరామనగరంలో వసంత పంచమిని పురస్కరించుకొని యాగశాలలో విజయప్రాప్తికి విశ్వక్సేనేష్టి, విద్యాప్రాప్తికి హయగ్రేష్టి, అష్టాక్షరి మహామంత్ర జపాలు నిర్వహించారు. చతుర్వేద పారాయణాలు, హోమాలు యథావిధిగా కొనసాగాయి. త్రిదండి చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రవచన మండపంలో శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జపాల ప్రాముఖ్యాన్ని వివరించారు. మంత్రం అంటే తలిచేవాడికి సహాయం చేసేదని.. అందుకే దైవ మంత్రాన్ని తలిస్తే అంతే మంచే జరుగుతుందని చినజీయర్ స్వామిజీ అన్నారు. శక్తి ఉంటే మహాయజ్ఞం సాధ్యవుతుందన్నారు. శ్రీ రామన్నారాయణుడే మానవుడి రూపంలో ఈ దివ్యక్షేత్రానికి వచ్చి ఆశీస్సులు అందిస్తున్నారని..
భగవంతుడి దీవెనలతోనే ఈ మహాత్కార్యం సాధ్యమయిందని చినజీయర్ ప్రభోదించారు. మంత్రం ఏదైనా మానవుడికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. సహజశక్తిని స్వీకరించడం మానవ లక్షణమన్నారు. అందుకే మనమందరం ఓం నమః అంటూ తలుస్తుంటామన్నారు.
వాసుదేవయా అంటే సహాయం కోరడమని అర్థమన్నారు. ఓం నమః నారాయణాతి.. అనేది రారాజు మంత్రమన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వేదపండితులు మహాయాగశాలలో అష్టాక్షరి జపమంత్రంతో క్రతువు జరిపించారు. ప్రవచన మండపంలో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి విచ్చేసిన వేదపండితులు వేదపారాయణం, ప్రవచన మంగళనీరాజనాలను భక్తులకు అందజేశారు. అనంతరం ప్రవచన మండపంలో నిర్వహించిన పలు కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
– మణికొండ, ఫిబ్రవరి 5
నాలుగు రోజులు.. లక్ష మంది భక్తులు
మణికొండ, ఫిబ్రవరి 5: 216 అడుగుల శ్రీభగద్రామానుజాచార్యుల విగ్రహం.. సమతామూర్తి చుట్టూ 108 దివ్యదేశాలు.. 12 మంది అళ్వారుల మందిరాలతో దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నది. సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేదపండితుల మంత్రోచ్ఛరణలతో విశేష కార్యక్రమాలు నిర్వహించగా.. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు శ్రీరామనగరాన్ని సందర్శించి పునీతులవుతున్నారు. ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలుస్తున్న ఈ క్షేత్రం భవిష్యత్‌లో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ దివ్యక్షేత్రం నిర్మాణ పనులు ఆరేండ్ల క్రితం మొదలు కాగా.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. 2022 ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో చారిత్రక ఘట్టానికి పునాదులు పడ్డాయి. సమతామూర్తి విగ్రహాన్ని 200 నుంచి 300 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా శిల్పులు, నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు తోడు రామానుజాచార్యుల జీవిత విశేషాలు, త్రీడీ షోల రూపంలో భక్తులకు అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చి పూజాకార్యక్రమాల్లో పాల్గొని దివ్యక్షేత్రాన్ని చూసి సాక్షాత్తూ భగవంతుడిని వీక్షించినట్లుగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి అతి చేరువలో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు దగ్గరగా ఉండటంతో పాటు మహబూబ్‌నగర్, జడ్చర్లకు వెళ్లే దారిలో ఈ ఆధ్యాత్మిక క్షేత్రం ఉండటంతో పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించనున్నది. మహానగరం సిగలో మరో కలికితురాయిగా వెలుగొందనున్నది.
నగర సిగలో..
సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): మహానగర పర్యాటకంలో మరో అద్భుతం వచ్చి చేరింది. కనీవినీ ఎరుగని రీతిలో 216 అడుగుల పొడవైన భారీ సమతామూర్తి విగ్రహం హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మహానగర చరిత్రలో ఇప్పటి వరకు ఇంతటి భారీ నిర్మాణం ఎక్కడా లేదు. 1992 సంవత్సరంలో హుస్సేన్‌సాగర్‌లో 58 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని పెట్టగా.. అనంతరం దేశంలో అతిపెద్దదైన జాతీయ జెండాను హుస్సేన్‌సాగర్ సమీపంలోని సంజీవయ్యపార్కులో ఏర్పాటు చేశారు. తాజాగా శ్రీరామానుజాచార్యుల విగ్రహం ముచ్చింతల్‌లో కొలువు దీరి రికార్డు సృష్టించింది. 1000 ఏండ్ల క్రితం ధరాతలంపై నడియాడిన రామానుజాచార్యులు మళ్లీ దర్శనమిస్తున్నారా అన్నట్లుగా 45 ఎకరాల విస్తీర్ణంలో స్వర్ణశోభిత శిల్పకళతో కండ్లు చెదిరేలా ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆహ్లాద వాతావరణం.. అలరించే రంగురంగుల మొక్కలు .. ఆధ్యాత్మిక సుగంధాల మధ్య పద్మాసనంలో ఉన్న రామానుజాచార్యుల విగ్రహ సందర్శనకు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఇప్పుడు దేశ, విదేశీయుల టూరిజం డెస్టినేషన్‌లో సమతామూర్తి విగ్రహం చేరడంతో హైదరాబాద్ బ్రాండ్ మరోమారు విశ్వవ్యాప్తం కానున్నది.
రామానుజాచార్యుడి బోధనలు ఆచరించాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సమతావాదాన్ని చాటిన గొప్ప మానవతావాది శ్రీరామానుజాచార్యులని.. ఇంతటి గొప్ప సంస్కరణమూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి లోకానికి అంకితం చేయడం ఎంతో గొప్ప విషయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.రామానుజాచార్యుల విగ్రహావిష్కరణలో పాల్గొన్న కేంద్రమంత్రి మాట్లాడుతూ 8 ఏండ్లుగా చినజీయర్ స్వామి అహోరాత్రులు శ్రమించి భక్తులందరినీ ఏకం చేసి గొప్ప కళా ఖండాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాన్ని ప్రపంచానికి అందజేశారని కొనియాడారు. రామానుజాచార్యుడి స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలన్నారు. చినజీయర్ స్వామి ఆలయాలే కాకుండా విద్యా సంస్థలు, మెడికల్ కళాశాలలు నిర్మించి సమాజానికి సేవలు అందజేస్తున్నారని కొనియాడారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో చినజీయర్ స్వామి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని.. పర్యాటక రంగంలో హైదరాబాద్ ప్రపంచపటంలో ఎంతో గొప్పగా నిలువబోతున్నదని పేర్కొన్నారు.
వేకువ జామునే..
వేద ఘోషతోనే శ్రీరామనగరంలో తెల్లవారుతుంది. ఉదయం నాలుగు గంటలకే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. ఐదు గంటలకు వ్యాయాయం, ప్రాత:స్మరణ, సంధ్యావందనం, యోగా సాధన చేయిస్తారు. ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. నాలుగు అంశాల బోధన తర్వాత మధ్యాహ్న సంధ్యావందనం, భోజనం చేస్తారు. సాయంత్రం క్రీడలు, పారాయణాల పఠనం, సాయం సంధ్యావందనాలు చేస్తారు. రాత్రి 9 గంటలకు భోజనంతో దినచర్య ముగుస్తుంది. కఠోర సాధనతో నిష్ణాతులైన ఆచార్యుల శిక్షణలో ఇక్కడి విద్యార్థులు అన్ని అంశాల్లో రాటు దేలుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వేద వాజ్ఞ్మయ పరిరక్షణే ధ్యేయం..
భారతీయ వేద వాజ్ఞయం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే జీవా గురుకుల ధ్యేయం. వేదాల సారాన్ని అనుసరిస్తే జీవన విధానంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనే శక్తి వస్తుంది. సామరస్య ధోరణి అలవడుతాయి. అనుభవజ్ఞులైన వేద పండితుల మార్గదర్శనంలో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
– త్రిదండి చినజీయర్ స్వామిజీ
వేదవాజ్ఞయాన్ని పరిరక్షించుకోవాలి..
వేద వాజ్ఞయ పరిరక్షణ మన అందరి బాధ్యత. చినజీయర్ స్వామి సంకల్పానికి మా వంతు సహకారం అందించడం పూర్వజన్మ సుకృతం. ఎందరో వేద పండితులు ఇక్కడ తయారు అవుతున్నారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో వేద విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం.
– రామేశ్వర్రావు, మైహోం అధినేత
ఉజల భవిష్యత్..
వేద వాజ్ఞయ బోధన, శిక్షణే కాకుండా ఇక్కడ విద్యార్థులతో అధ్యయనం చేయిస్తున్నాం. విదేశాల్లో వేద పండితులతో ఘోస్టులు నిర్వహించి సమాజధార్మిక పరివర్తనపై సదస్సులు నిర్వహిస్తున్నాం. శ్రీరామనగరంలోని వేద విశ్వవిద్యాలయం భవిష్యత్ తరాలకు ఉజల భవిష్యత్ ఇవ్వడంతో పాటు విశ్వ విఖ్యాతం చేయడమే స్వామిజీతో పాటు మా అందరి ఆకాంక్ష.