చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 5: పాతబస్తీలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదేండ్ల బాలిక నాలుగో తరగతి చదువుతున్నది. ప్రతిరోజు మాదిరిగానే బాలికతో పాటు ఆమె సోదరుడిని తాత పాఠశాలకు తీసుకొచ్చి..వెళ్లిపోయాడు. ఆ బాలిక తరగతి గదిలో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అశ్వాక్ అహ్మద్ ఖాన్(35) తీవ్రంగా కొట్టి.. లైంగిక దాడికి యత్నించాడు.
బాధితురాలు కేకలు వేయడంతో దగ్గర్లోనే ఉన్న ఆయా వచ్చి..రక్షించింది. ఉపాధ్యాయుడిని గదిలోనే ఉంచి బయట నుంచి గొళ్లెం పెట్టారు. బాలిక తండ్రికి సమాచారం ఇవ్వడంతో అతడు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కొన్నాళ్లుగా ఆ ఉపాధ్యాయుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ తెలిపారు. అయితే మతిస్థిమితం లేని వ్యక్తి ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ.. జీతం తీసుకుంటుంటే ఇన్నాళ్లు అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.