సైదాబాద్, ఫిబ్రవరి 5 : అందమైన పాఠశాల భవనం..ఇందులో అన్ని సౌకర్యాలు..విశాలమైన ఆటస్థలం..డిజిటల్ తెరపై ఆధునిక బోధన..ఆహ్లాదపరిచే వాతావరణం..ఇదంతా చంచల్గూడ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో కాలడేరా ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలు. ఈ పాఠశాలలో అడుగుపెడితే కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆకట్టుకుంటోంది.
మంచుకొండ ఫౌండేషన్ సేవలతో మార్పు
పాఠశాలకు ఎంతోమంది దాతలు తమ సహకారమిస్తున్నా మంచుకొండ ఫౌండేషన్ సంస్థ సేవలు అనిర్వచనీయం. 2020లో మంచుకొండ ఫౌండేషన్ పాఠశాలను దత్తత తీసుకొని నాటి నుంచి అనేక కార్యక్రమాలను చేపడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. విద్యార్థులు, పాఠశాల అవసరాలను గుర్తించి వారు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బడిలో ముగ్గురు మహిళా ఉత్తమ ఉపాధ్యాయులు
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన జయలక్ష్మి, అమ్మాజీ, నిర్మల ఈ పాఠశాల ఉపాధ్యాయులు. జయలక్ష్మి గణితం, అమ్మాజీ ఇంగ్లిష్, నిర్మల సైన్స్ బోధిస్తున్నారు. జయలక్ష్మి గణితాన్ని పిల్లలకు సులభంగా అర్థమమ్యేలా అభ్యసన సామగ్రితో గణితం మీద ఆసక్తి పెంచేలా బోధించటంలో సిద్ధహస్తురాలు. విద్యార్థులు ఇంగ్లిష్కు భయపడకుండా సులువుగా అర్థమయ్యేలా రాయడానికి ఆసక్తి పెంచేలా రాగయుక్తంగా పాడి వారిలో ఉత్సాహం నింపుతారు అమ్మాజీ టీచర్. నిర్మల…పాఠశాలలో పరిసరాల విజ్ఞానాన్ని బోధిస్తూ ఎంతో ఉత్సాహంగా అందమైన బొమ్మలు, అక్షరాలతో విద్యార్థులను ఎంతో ఆకర్షిస్తూ పరిసరాల విజ్ఞానం బోధించటంలో దిట్ట.
పాఠశాలలో సీనియర్ టీచర్ సుజాత
పాఠశాలలో తెలుగు విద్యార్థులకు ఎంతో సులభంగా అర్థమమ్యేటట్లుగా సులభంగా బోధిస్తారు సీనియర్ టీచర్ సుజాత. విద్యార్థులను అన్ని అంశాల్లో ప్రోత్సాహమిస్తూ వారికి బహుమతులు అందిస్తూ వారిలో విద్యపై ఆసక్తి పెంచేలా చర్యలు తీసుకుంటారు. జూనియర్ టీచర్ రేష్మా..గణితం,తెలుగు సబ్జెట్లను సామగ్రితో నేరుగా వివరిస్తారు. అంతేకాదు కోలాటం, డ్యాన్స్ నేర్పుతూ చదువుపై వారిలో ఆసక్తి పెంచేందుకు
శ్రమిస్తుంటారు.
పాఠశాలను అందంగా తీర్చిదిద్దాం..
2020లో పాఠశాలను దత్తత తీసుకోగానే శిథిల గోడలను గుర్తించి మరమ్మతులు చేసి అందమైన బొమ్మలు, స్వయ అభ్యసనానికి అనుకూలంగా విషయాలను చిత్రీకరించాం. పిల్లల మానసిక ఒత్తిడి తగ్గేలా పాఠశాల ఆవరణాన్ని ఆధునీకరించాం. డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి వ్యవస్థ,సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళావేదిక ఏర్పాటు చేశాం. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలు కొసాగిస్తాం.
– ప్రకాశం, మంచుకొండ ఫౌండేషన్ నిర్వాహకుడు
పాఠశాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు
పాఠశాల అభివృద్ధిలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర చాలా ఉంది. దాతల సహకారం తో ప్రతిరోజు టిఫిన్ అందిస్తున్నాం. 2015లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి విద్యార్థుల సం ఖ్యను రెట్టింపు చేయటంలో ఎంతో శ్రమించాం. విద్యార్ధులతో నిత్యం యోగా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం.
– మందడి వెంకట్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు