బంజారాహిల్స్, ఫిబ్రవరి 5: ప్రముఖ కుచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ అవార్డు గ్రహిత పద్మజారెడ్డిని తెలుగు కళా సమితి ఘనంగా సత్కరించింది. శనివారం తెలుగు కళా సమితి దోహా-ఖతర్ ఆధ్వర్యంలో జింఖానా క్లబ్లో పద్మశ్రీ డాక్టర్ పద్మజారెడ్డి ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎల్వీ.గంగాధర్ శాస్త్రి మాట్లాడుతూ కళా రంగానికి జీవితాన్ని అంకితం చేయడంలో ఎంతో ఆనందం లభిస్తుందని అన్నారు. నాట్యం అభ్యసించి పరిశోధించి విశ్వ విఖ్యాతమైన మహోన్నత లక్ష్యంతో ఎందరినో నృత్యకారులుగా తీర్చిదిద్దిన డాక్టర్ పద్మజా రెడ్డికి పద్మశ్రీ లభించడం సముచిత ఔన్నత్యమని, తెలుగు జాతికి గర్వకారణమని అన్నారు.
డాక్టర్ పద్మజారెడ్డి మాట్లాడుతూ ఐదు దశాబ్దాల తన కృషి ఫలించిందని, కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ప్రకటించడంతో జన్మ ధన్యమైందని అన్నారు. ఈ పురస్కారాన్ని తన గురువు దివంగత నృత్యకారిణి శోభానాయుడుకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు కళాసమితి అధ్యక్షుడు ఉసిరికాయల తాతాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు ఎ.ప్రభు, డాక్టర్ మహ్మద్ రఫీ, మాధవి సిద్ధం, అమెరికా ఆటా ప్రతినిధులు కె.సత్యనారాయణ రెడ్డి, జి.రామచంద్రారెడ్డి, కథక్ పండిట్ అంజుబాబు, కలయిక నారాయణ, దయా హాస్పిటల్స్ డైరెక్టర్ వీఆర్ఆర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.