
జూబ్లీహిల్స్, జనవరి 24: కూతురు పెండ్లి కోసం దాచుకున్న డబ్బు అగ్ని ప్రమాదంలో గుడిసెతో పాటు ఆహుతి కావడంతో విలపించిన ఆ కన్నతండ్రి ఆవేదనను చూసిన సీఎం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. సోమవారం రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన 54 మంది లబ్ధిదారులకు ప్రత్యేక కానుకలతో పాటు రూ.54,06,264 విలువైన చెక్కులను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఆయన మానస పుత్రికలని, సంక్షేమ పథకాలన్నీ మానవీయకోణంతో ప్రవేశపెట్టినవేనని పేర్కొన్నారు. ఏ ఆధారం లేని పెద్దలు తమ అవసరాలకు కన్నబిడ్డలపై ఆధారపడకుండా ఆసరా పథకం వారిని ఆత్మగౌరవంతో బతికేలా చేసిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మన్సూర్, భాస్కర్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.