ప్రభుత్వ అండతో అంతర్జాతీయ డ్రగ్ డాన్ టోనీని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మత్తును అణిచి వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో హైరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సారథ్యంలో హైదరాబాద్ పోలీసులు సినీ ఫక్కీలో డ్రగ్ స్మగ్లర్ల ఆటకట్టించారు. తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’ సినిమాలోని అపరేషన్ ‘ఢీ’ తరహాలో నగర పోలీసులు అపరేషన్ ‘టీ’ నిర్వహించారు. టోనీ వద్ద లభించిన ఫోన్ డైరీని విశ్లేషించడంతో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలకు చెందిన వందల కోట్ల టర్నోవర్ చేసే పలువురు వ్యాపారుల లింక్‌లు భయటపడ్డాయి.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీపీ సీవీ ఆనంద్ కేసుల దర్యాప్తు మూలాల వరకు వెళ్తుందని, ఆయా కేసుల్లో ప్రధాన సూత్రదారులను అరెస్ట్ చేసే లక్ష్యంతో ముందుకు పోతామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా ఉందని, డ్రగ్స్ అమ్మే వారు, కొనేవారికి సంబంధించిన డిమాండ్, సైప్లె లింక్‌లను కట్ చేస్తామని వెల్లడించారు. ఆయన అన్నట్లే నేరగాళ్లపై కొరఢా ఝలిపిస్తున్నారు. సింగం సినిమాను తలిపించేలా సీపీ సీవీ ఆనంద్ తన సిబ్బందిని రంగంలోకి దింపి, దర్యాప్తులో దిశా నిర్ధేశం చేస్తూ నిందితులను పట్టుకుంటున్నారు.
టోనీని పట్టేశారు…!
కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయాల కోసం ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌ను ఈ నెల 6వ తేదీన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు, మధ్యవర్థులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకోం.. ఆయా కేసుల్లో నిందితుల అంతుచూసే వరకు వదిలిపెట్టమంటూ ఆనంద్ వెల్లడించారు. ముంబైలో డ్రగ్స్ సరఫరా చేసే ప్రధాన నిందితుడు టోనీ కోసం వేట కొనసాగుతుందని ఆనాడే చెప్పారు. ఆయన అన్నట్లుగానే టాస్క్‌ఫోర్స్ బృందాలను, కరోనా సమయంలో 10 రోజుల పాటు ముంబైలో మకాం వేయించారు. తెలంగాణ పోలీసుల వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి టోనీ కదలికలపై నిఘా పెట్టారు. జనవరి 6వ తేదీన ఇమ్రాన్ బాబు షేక్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టోనీ తన మకాం మార్చేశాడు. రెండు సార్లు తన ఇంటి చిరునామా మారుస్తూ నిఘా వ్యవస్థ కండ్లు పడకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా విదేశీ సిమ్‌కార్డును, ఇంటర్నెట్ ఫోన్స్‌ను వాడుతున్న టోనీని అరెస్ట్ చేశారు.
టోనీతో టచ్‌లో ఉన్న బడాబాబులు
టోనీ దేశ వ్యాప్తంగా ముంబైకి చెందిన వారి ద్వారా నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నాడు. అలాగే టోనీ ఆయా పట్టణాల్లో నేరుగా డ్రగ్స్ కొనుగోలుదారులతో టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లో ఉండే బడా వ్యాపారులు తమకు డ్రగ్స్ కావాలంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెడుతారు.. ఆ మెసేజ్‌ను చూసి టోనీ తన ఏజెంట్ల ద్వారా పలాన చోటకు వెళ్లి కొంత మొత్తంలో డ్రగ్స్ అందించాలని తన నెట్ వర్క్‌కు సమాచారం ఇస్తుంటారు. సిటీ పోలీసులు ఆరా తీయడంతో సుమారు 13 మంది పేర్లు బయటకు వచ్చాయి. అందులో ఏడుగురు వ్యాపారులను, వారికి సహకరించిన ఇద్దరు అఫీస్ బాయ్స్‌ను అరెస్ట్ చేశారు. అరస్టైన వ్యాపారులు ఒకరి నుంచి మరొకరు టోనీ గురించి తెలుసుకొని డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది.
స్టార్బాయ్ని పట్టేస్తారా..?
ఆఫ్రికా దేశాల నుంచి అక్రమంగా సముద్ర మార్గంలో ముంబైకి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ పద్ధతిలో వచ్చిన సరుకును నైజీరియన్లు వారి వారి మర్గాల ద్వారా సొంతం చేసుకుంటున్నారు. విదేశాల్లో ఆఫ్రికా దేశస్థుడైన స్టార్ బాయ్‌కి టోనీ లాంటి వాళ్లు అనేక మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్లు డ్రగ్స్ ఆర్డర్ పెట్టి, అందుకు సంబంధించిన డబ్బును ఆన్లైన్లో చెల్లిస్తున్నారు. స్టార్ బాయ్ అసలు పేరు కూడా టోనీకి తెలియదు. స్టార్ బాయ్ అనే నిక్ నేమ్‌తో ప్రధాన డ్రగ్స్ విక్రయదారుడు కొనసాగుతున్నాడు. ఇతన్ని ఇప్పుడు పట్టుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పెరుగాలి. అందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. నైజీరియన్ ఎంబసీ ద్వారా ఒత్తిడి తేవాలని సన్నాహాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తే దేశానికి పట్టిన మత్తును తెలంగాణ పోలీసులు వదిలించేయడం పక్కాగా జరుగుతుంది.