కరీంనగర్: ఈ నెల 30 నిర్వహించే హుజూరాబాద్ ఉప ఎన్నికకు కరీంనగర్ జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,37,036 మంది ఓటర్లు ఉండగా, ప్రశాంతంగా, నిష్పపక్ష పాతంగా ఓటు వినియోగించుకునేలా ఓటర్లను చైతన్యం చేశారు. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికలకన్నా పోలింగ్‌కేంద్రాలను పెంచారు. అంతేకాదు, పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 200 మీటర్ల వరకు.. పార్టీ వ్యక్తులెవరూ ఉండకుండా చర్యలు తీసుకున్నారు.
306 పోలింగ్ కేంద్రాలు..
ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్యను ఆధారంగా చేసుకొని మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో హుజూరాబాద్‌లో 79, జమ్మికుంటలో 78, ఇల్లందకుంట 29, వీణవంక 55, కమలాపూర్‌లో 65 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
1715 మంది పోలింగ్ సిబ్బంది..
ఉప ఎన్నిక నిర్వహణకు 1715 మంది పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. అందులో 1224 మంది వివిధ హోదాల్లో విధుల్లో ఉండగా, 491 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం టీకా రెండు డోసులు తీసుకున్న సిబ్బందిని మాత్రమే విధులకు వినియోగించనున్నారు. ఇదే సమయంలో పోలింగ్ సందర్భంగా 306 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పక్కాగా కొవిడ్ నిబంధనలు..
కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ మేరకు అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల హెల్ప్ డెస్క్, హెల్త్ డెస్క్‌లను ఏర్పాటుచేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు మాస్కులు లేకుండా ఎవరైనా ఓటర్లు వస్తే సదరు ఓటర్లకు మాస్కులను అందుబాటులో పెడుతున్నారు. కేంద్రాల్లోకి వెళ్లే ముందు ప్రతి ఓటరు చేతులను శానిటైజ్ చేస్తారు. హెల్త్ వర్కర్ థర్మామీటర్‌తో టెంపరేచర్ చెక్ చేస్తారు. ఓటర్లు ఈవీఎం బ్యాలెట్ యూనిట్ బటన్ ప్రెస్ చేయుటకు కుడిచేతికి గ్లౌజులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూలైన్లలో ఓటరుకు ఓటరుకు మధ్య 6 ఫీట్ల దూరం ఉండేలా చూడనున్నారు. ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లను శానిటైజ్ చేయించారు. ఓటు హక్కు వినియోగించుకునే కొవిడ్ రోగులకు పీపీఈ కిట్లను సమకూర్చనున్నారు. ఎక్కువ టెంపరేచర్‌తో బాధపడే వారికి పోలింగ్ చివరి సమయంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్..
పోలింగ్ ఈ నెల 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు కొనసాగనున్నది. గతంలో సాధారణ ఎన్నికల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరిగేది. కానీ, కొవిడ్ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని.. ఈ సారి పోలింగ్ సమయాన్ని రాత్రి 7గంటల దాకా పొడిగించారు. ఉప ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలలో మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇతర పబ్లిక్ లేదా ప్రైవేట్ స్థలాల్లో 100 మీటర్లలోపు, పోలింగ్ స్టేషన్లకు 200 మీటర్లలోగా ఎలాంటి ప్రచారాలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు.
భారీ బందోబస్తు..
శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 3,865 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో 20 కంపెనీల కేంద్ర బలగాలుండగా, 74 మంది ప్రత్యేక పోలీసులు, 700 మంది కరీంనగర్ జిల్లా పోలీసులు, 1471 మంది ఇతర జిల్లాల సిబ్బందికి డ్యూటీలు వేశారు. ఇదే సమయంలో సోషల్ మీడియాతోపాటు సాధారణంగా వచ్చే పుకార్లు, తప్పడు ప్రచారాలపై పోలీసులు నిఘాపెట్టారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లుగా ఏమైనా ఆధారాలుంటే.. సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఇప్పటికే సూచించారు. ఎన్నికల పోలింగ్‌కు 72 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ (27.10.2021 సాయంత్రం 7 గంటల నుంచి 31.10.2021 వరకు) ప్రకటించారు. సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా అన్ని మద్యం షాపులు, మద్యం విక్రయించే హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేశారు. ఎన్నిక ప్రశాతంగా నిర్వహించేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఐదుగురికి మించి ఎక్కువ గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ రోజు వరకు ఇంటింటి ఎన్నికల ప్రచారం ఐదుగురికి మించకుండా నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
ప్రతి ఓటర్ తన ఓటు వినియోగించుకోవడానికి ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు సంబంధిత అధికారులు ఈ విషయాన్ని ప్రజలకు వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో 97 శాతం ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీచేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే. గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో ఎలక్ట్రోరల్ ఫొటో గుర్తింపు (ఎపిక్) కార్డు లేదా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 11 గుర్తింపు కార్డులు ఏదో ఒకటి ఉండాలని చెబుతున్నారు.