అంబర్‌పేట, డిసెంబర్ 26: భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, అంబేద్కర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ లేబర్ పని చేస్తుంటాడు. త్రివేణి(26)ని ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. వీరికి బాబు, పాప సంతానం. కొంతకాలంగా త్రివేణిని అనుమానిస్తున్న వెంకటేశ్.. ఆమెతో గొడవపడుతూ కొట్టేవాడు.. వేధించేవాడు. దీంతో ఎనిమిది నెలలుగా దూరంగా ఉన్నారు.
ఇటీవలే తాను మారిపోయానని భార్య త్రివేణికి చెప్పి మళ్లీ ఆమె వద్దకు వచ్చాడు. నల్లకుంట తిలక్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. అతను సెంట్రింగ్ పనికి వెళ్తుండగా, త్రివేణి హౌస్‌కీపింగ్ పనికి వెళ్తుండేది. ఏ కొంచెం ఆలస్యమైనా అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెట్రోలు తీసుకొచ్చి గదిలో దాచాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి త్రివేణి నిద్రిస్తుండగా, వెంకటేశ్ తన కుమారుడిని బయటకు తీసుకువచ్చి నిల్చోబెట్టాడు. మళ్లీ లోపలకు వెళ్లి నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
బయటకు వచ్చి కుమారుడిని తీసుకొని పరారయ్యాడు. కూతురు లేచి అరవడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లోపలకు వెళ్లి చూడగా, అప్పటికే త్రివేణి 90 శాతం కాలిన గాయాలతో పడి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి తండ్రి అప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పట్టుకున్నారు.