బాడీ స్ప్రే లేకుండా.. బయట అడుగు పెట్టడం లేదెవ్వరు. దుర్వాసనను తప్పించుకునేందుకో, సువాసన కోసమో వీటిని వాడుతున్నారు. అయితే, బాడీ స్ప్రేలు విరివిగా వాడటం చర్మానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల కాస్మోటిక్స్లోని రసాయనాలు.. లేనిపోని సమస్యలను తీసుకొస్తాయని హెచ్చరిస్తున్నారు.
సౌందర్య ఉత్పత్తుల వల్ల చర్మ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నదని ఇండియన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ నివేదిక చెబుతున్నది. ఇందుకు సంబంధించి రెగ్యులర్గా బాడీ స్ప్రేలు చేసే 2150 మందిపై పరిశోధనలు చేశారు. వీరిలో 400 మందికి చర్మ వ్యాధులు వచ్చాయని గుర్తించారు. ఈ చర్మ సమస్యలకు బాడీ స్ప్రేలలో వాడే ప్రొపిలిన్ ైగ్లెకాల్ అనే రసాయనం కారణమైందని వెల్లడించారు. దీనితోపాటు దుర్వాసనను పోగొట్టడానికి ఉపయోగించే సోడియం యాసిడ్ కార్బొనేట్, జింక్ కార్బొనేట్, పారాబెన్స్ లాంటి వివిధ రకాల రసాయనాలు చర్మానికి ఏమాత్రం మంచివికాదని హెచ్చరిస్తున్నారు.
ఇవి చర్మంలోకి, శరీరంలోకి వెళ్తే.. హైపర్ పిగ్మెంటేషన్, కాంటాక్ట్ డెర్మటైటీస్ లాంటి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందట. చర్మం ఎర్రగా/ నల్లగా మారడం, దురద, మంట, దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు పలకరిస్తాయి. కొందరిలో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. మరికొందరిలో తలనొప్పి, చికాకు, కళ్లు ఎర్రబారడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆల్కహాల్, పారాబెన్ లాంటి హానికర రసాయనాలు లేని బాడీ స్ప్రేలను ఎంపిక చేసుకోవాలి.
కొత్తరకం కాస్మోటిక్స్ వాడాలని అనుకున్నప్పుడు.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మొదటి రెండుమూడు రోజులు చెవి వెనుక భాగం, చేతి వెనుక స్ప్రే చేసుకోవాలి. ఆ ప్రదేశంలో దురద పెట్టినా, చర్మం రంగులో మార్పు కనిపించినా ఆ బాడీ స్ప్రేలకు దూరంగా ఉండటమే మంచిది. కాస్మోటిక్స్ వాడినా.. ముఖం, కళ్లు, ముక్కు, చెవిలోపల, నోరు, ప్రైవేట్ పార్ట్స్, గాయాల దగ్గర బాడీ స్ప్రేలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించొద్దు. బాడీ స్ప్రేలకు బదులుగా రసాయనాలు లేని రోలర్స్ వంటివి వినియోగించడం మంచిది.