ఒకప్పుడు అమెరికా, యూరప్‌లోనే కనిపించిన రోడ్ ట్రిప్ ట్రెండ్.. ఇప్పుడు మనదగ్గరా మొదలైంది. బైక్‌లపై సాహసయాత్రలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా, పర్వత ప్రాంతాల్లో విహరించేందుకు నవతరం ఆసక్తి చూపుతున్నది. అయితే, శీతాకాలంలో పొగమంచు ఎంత అందంగా కనిపిస్తుందో.. అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో, అందమైన ప్రకృతిలో ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే సరి.
దట్టమైన పొగమంచులో.. కళ్లకన్నా చెవులే ఎక్కువ భద్రతను అందిస్తాయి. మీ కారులో మ్యూజిక్‌ను తగ్గించి.. మీకు దగ్గరగా వచ్చే వాహనాల హారన్లను వినడంపై దృష్టిపెట్టండి. ఇందుకోసం కిటికీలను కొద్దిగా తెరిచి ఉంచుకోండి. పొగమంచులో ధ్వని భిన్నంగా ప్రయాణిస్తుంది. కాబట్టి, రాబోయే ప్రమాదాలను కళ్లతో చూడకముందే.. చెవులతో వినండి. ఇరుకైన, పదునైన మలుపుల్లో, కొండ రహదారుల్లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముందస్తు హెచ్చరికల కోసం ఇంజిన్, టైర్ శబ్దాల్లో సూక్ష్మమైన మార్పులను గమనించడానికి తగిన ప్రాక్టీస్ చేయండి.
బయట పొగమంచు కమ్ముకున్నప్పుడు.. కారు లోపల ఏర్పడే కండెన్సేషన్ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కారు అద్దాలను ఫాగ్‌తో నింపేస్తుంది. ఈ పొగమంచు డ్రైవర్ దృష్టిని తప్పుదోవ పట్టిస్తుంది. చాలా సందర్భాల్లో దగ్గరగా ఉన్న వాహనాల్ని కూడా దూరంగా ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. దీనిని నివారించడానికి కార్లో డీఫాగర్, ఎయిర్ కండిషనింగ్‌ను ఉపయోగించండి. శుభ్రమైన విండ్‌షీల్డ్‌ను ఏర్పాటు చేసుకోండి. వెంటవెంటనే శుభ్రం చేసుకోవడానికి ఓ మైక్రోఫైబర్ వస్ర్తాన్ని దగ్గర ఉంచుకోండి. వైపర్ ఫ్లూయిడ్ స్థాయులను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి.
రోడ్డుకు ఎడమ అంచున ఉండే తెల్లని గీత.. పొగమంచులో ఉత్తమమైన మార్గదర్శిగా మారుతుంది. అందుకే, బైక్ యాత్రికులు ఈ రేఖపై ప్రత్యేక దృష్టిపెట్టండి. ఇది మీ లేన్‌ను సక్రమంగా నిర్వహించడానికి, ముఖ్యంగా మలుపులు తిరుగుతున్న రోడ్లపై డ్రిఫ్ట్‌ను నివారించడానికి సాయపడుతుంది. పదునైన వంపులు తిరిగిన రహదారిపై.. మరింత భద్రతను అందిస్తుంది.
నావిగేషన్ యాప్‌లు ఉపయోగకరంగానే ఉంటాయి. కానీ, పొగమంచు ఉన్న పరిస్థితుల్లో వాటిపై గుడ్డిగా ఆధారపడకండి. మీ ముందున్న నిలిచిపోయిన వాహనాల గురించి జీపీఎస్ మిమ్మల్ని ఎప్పుడూ హెచ్చరించదు. గుంతల సంగతిని మీతో పంచుకోదు. సాధారణ నావిగేషన్ అవసరాలకు వాడుకున్నా.. దృష్టిని రహదారిపైనే కేంద్రీకరించండి. సాంకేతికత ఒక సాధనం మాత్రమే. జాగ్రత్తకు ప్రత్యామ్నాయం కాదు.
పొగమంచు చాలా దట్టంగా ఉన్నట్లయితే.. లే-బై, పెట్రోల్ బంక్ వంటి సురక్షితమైన ప్రదేశాల్లో ఆగండి. వాహనాన్ని రోడ్డుపైనే నిలపకండి. ఎందుకంటే.. వేరే డ్రైవర్లు మిమ్మల్ని గమనించకపోయే అవకాశం ఉంటుంది. హజార్డ్ లైట్లు ఆన్ చేసి, పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండండి.