యునైటెడ్ నేషన్స్/కీవ్, ఏప్రిల్ 23: రష్యా చేజిక్కించుకున్న మరియుపోల్‌లోని అజోవ్‌స్టాల్ స్టీల్‌ప్లాంట్ అండర్‌గ్రౌండ్ షెల్టర్లలో వందల సంఖ్యలో మహిళలు, చిన్నారులు చిక్కుకుపోయారు. ఉక్రెయిన్ నేషనల్ గార్డ్ అజోవ్ రెజిమెంట్ శనివారం ఓ వీడియో విడుదల చేసింది.
స్వేచ్ఛా వాయువు పీల్చాలనుకుంటున్నామని, దాదాపు రెండు నెలలుగా తాము ఆకాశాన్ని గానీ, సూర్యుడ్ని కానీ చూడలేదని మహిళలు అందులో చెప్పారు. ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యం అధీనంలో ఉన్న ఈ ప్లాంట్‌ను కూడా స్వాధీనం చేసుకునేందుకు రష్యా దాడులు కొనసాగిస్తున్నది. అజోవ్‌స్టాల్‌లో ఉక్రెయిన్ బలగాలతో సహా దాదాపు వెయ్యి మంది చిక్కుకుపోయారు.
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. డొనెట్స్, లుహాన్స్ రీజియన్లను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఎనిమిది రష్యా దాడులను తమ బలగాలు తిప్పికొట్టాయని ఉక్రెయిన్ మిలటరీ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఖార్కీవ్, పొపాస్నా పట్టణాల్లో రష్యా షెల్లింగ్ దాడుల్లో నలుగురు మరణించారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శాంతి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే వారం రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వేర్వేరుగా భేటీ అవుతానని గుటెరస్ స్వయంగా ట్విట్టర్లో పేర్కొన్నారు.