Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాటు, వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పసరా నుంచి నార్లాపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి.
ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వాహనాల, భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ఉపయోగించిన ఆధునిక టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఏ మాత్రం ఫలితాలు ఇవ్వలేకపోయాయి. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసింది. మేడారం నుంచి పసరాకు చేరేందుకు 10 గంటల సమయం పడుతోంది. పసరా నుంచి తాడ్వాయి చేరుకునేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతోంది.
మేడారం భక్తులను ఆర్టీసీ నిలువుదోపిడీ చేసింది. జాతర కోసం ఏర్పాటు చేసిన 4వేల బస్సుల ద్వారా ఒక్కో ప్రయాణికుడి నుంచి 50శాతం అదనంగా చార్జీలు వసూలు చేసింది. 2024జాతరకు 17లక్షల మంది 3,491 బస్సుల ద్వారా ప్రయాణం చేయగా.. ఈ సారి 20 లక్షలకు పైగానే భక్తులు 4వేల బస్సుల ద్వారా ప్రయాణం చేసినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. జీరో టిక్కెట్లు మినహా ఒక్కో టిక్కెట్‌పై 50శాతం అదనంగా వసూలు చేశారు. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ఈ ప్రత్యేక బస్సులు తిప్పినట్లు చెప్పారు. ఆర్టీసీలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ బస్సుల ద్వారా 50శాతం వరకూ అదనంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు 2003లో జారీ చేసిన జీవో 16ను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉటంకిస్తున్నారు