అబిడ్స్, జనవరి 30: నాంపల్లి స్టేషన్ రోడ్డులో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మృతుడి చివరి ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా షోరూంలో గత శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున మంటలు రావడం, పొగ కమ్ముకు పోవడం, భవనం రెండు సెల్లార్లలో ఇరుక్కు పోయి ఐదుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రభుత్వ వివిధ శాఖల అధికారులు 22 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పడంతో పాటు మృతి చెందిన ఐదుగురి మృత దేహాలను తీసిన విషయం తెలిసిందే.
అందులో బేబి, ప్రణిత్, అఖిల్, హబీబ్‌తో పాటు ప్రస్తుతం ఆడియో వైరల్ అవుతున్న ఇంతియాజ్ కూడా ఉన్నారు. కాగా భవనం మొదటి సెల్లార్లో ఉన్నానని తాను ఇద్దరం పిల్లలం ఉన్నాం బయటకు రావడానికి మార్గం లేదు. మేము చని పోతామంటూ షోరూంలోని తోటి ఉద్యోగికి ఫోన్ చేసిన ఆడియో బయట వైరల్ అవుతుంది. ఇంతియాజ్ అన్నా చనిపోయేట్లున్నాం, నాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెల్లార్‌లోని యాది (యాదయ్య వాచ్మెన్) తలుపు మూసి ఉందని ఫోన్లో చెప్పగా ఇవతలి వైపు నుంచి మాట్లాడిన వ్యక్తి గ్రిల్ గేట్ నుంచి బయట పడే ప్రయత్నం చేయాలని సూచించడం, అక్కడి నుంచి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఏం చేయలేక పోతున్నామని చెప్పగా రెండో సెల్లార్లోకి దూకాలని చెప్పగా ఇక్కడ మొత్తం అంధకారం ఉంది, ఏమి కనిపించడం లేదని సమాధానమివ్వడం ఆడియోలో ఉంది.
కనీసం సమీర్ తలుపు ఐనా తెరవమని చెప్పండని వేడుకోగా అసలు అగ్ని ప్రమాదం జరిగింది అక్కడేనని చెప్పడం ఆడియోలో వినిపించడం అందరిని కలిచి వేస్తోంది. ఘటన చోటు చేసుకున్న వారం రోజులకు ఈ ఆడియో విడుదల కావడంతో నెటిజన్లు ఆవేదన చెందుతున్నారు. ఆడియో సంభాషణను బట్టి చూస్తే ఇంతియాజ్ చివరి వరకు ప్రాణాలతో బయట పడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మిగిలిన హబీబ్, బేబిలు మరో చోట ఉండి వారు ఇదే విధంగా మృతి చెంది ఉండవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు.