సిటీబ్యూరో, జనవరి 30 ( నమస్తే తెలంగాణ ) : యాప్ ఆధారిత డ్రైవింగ్ అంటే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. గమ్యం చేరేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడోకు చెందిన కొందరు డ్రైవర్లు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ హడలెత్తిస్తున్నారు. డ్రైవింగ్ అర్హత ఉందా లేదా తెలుసుకోకుండానే సదరు కంపెనీలు అనుమతులిస్తు న్నాయి. ర్యాష్ డ్రైవింగ్,మద్యం మత్తులో వాహనాలు నడపడం, ఫిట్‌నెస్‌లేని బండ్ల వాడకం, మహిళా ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం, రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ప్రయాణికుల భద్రత లక్ష్యంగా రవాణా శాఖ ఓలా ఉబర్, ర్యాపిడో సంస్థలకు నిబంధనలు జారీ చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎటువంటి యాప్ ఆధారిత ప్రయాణానికి అనుమతి లేదు. ఓలా, ర్యాపిడో, ఉబర్‌లకు ఆర్టీఏ అనుమతులు లేవు. యాప్ ఆధారిత కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు, రవాణా శాఖకు నగర ప్రయాణికులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఆల్కహాల్ పరీక్ష తప్పనిసరి చే యాలని, కంప్లెంట్స్ను రెం డు గంటల్లో పరిష్కరించాలని, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులతో డేటా షేరింగ్ ఉండాలని కోరుతున్నారు.
మియాపూర్-కూకట్పల్లి రోడ్డులో ర్యాపిడో బైక్ డ్రైవర్ హెల్మెట్ లేకుండా వేగంగా జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేయడంతో వెనుక కూర్చొన్న ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
హైటెస్ సిటీ ప్రాంతంలో ఓలా క్యాబ్ డ్రైవర్ మైబైల్ కాల్ మాట్లాకుంటూ డ్రైవింగ్ చేయడంతో ఫుట్‌పాత్‌పైకి
దూసుకెళ్లింది. పాదచారులు పరుగులు తీశారు. దిల్సుఖ్నగర్ జంక్షన్ వద్ద ఉబర్ క్యాబ్ డ్రైవర్ రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
సికింద్రాబాద్-బోయిన్పల్లి రోడ్డులో ర్యాపిడో డ్రైవర్ ఒక్క బైక్‌పై ఇద్దరు ప్రయాణికులతో పాటు అదనపు సామగ్రితో ప్రయాణించి కిందపడిపోయారు.
హైటెక్‌సిటీలో రాత్రి సమయంలో ప్రయాణిస్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె భయాందోళనలకు గురైంది.
గచ్చిబౌలి నుంచి మాదాపూర్ వెళ్తున్న మహిళా ఉద్యోగిని క్యాబ్ డ్రైవర్ అనవసరంగా దారి మళ్లించడంతో ఆమె భయపడి ఎమర్జెన్నీ కాల్ చేయాల్సి వచ్చింది.
దిల్‌సుక్‌నగర్‌లో ఓ యువతిని డ్రైవర్ మార్గమధ్యంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి కావడంతో ఆమె భయాందోళనకు గురి కావాల్సి వచ్చింది.