నగరాల్లోనే కాదు.. పల్లెల్లోనూ పావురాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. చూసేందుకు ముద్దుముద్దుగా ఉండే ఈ పక్షులతో.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఇంటి వాతావరణం కూడా దెబ్బతింటుంది. అందుకే, పావురాలను ఇంటికి దూరంగా ఉంచడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. పావురాలను తరిమేయొచ్చని అంటున్నారు.
యూకలిప్టస్, పెప్పర్ మింట్ లాంటి నూనెల ఘాటైన వాసనను పావురాలు తట్టుకోలేవు. ఒక లీటర్ నీటిలో కొద్దిగా ఈ నూనెలు కలిపి.. బాల్కనీలు, కిటికీలు, రూఫ్టాప్స్ వద్ద స్ప్రే చేయాలి. దాంతో పావురాలు అటువైపు కన్నెత్తి చూడవు.
గ్లాస్ రిఫ్లెక్షన్కు పావురాలు బెదిరిపోతాయి. దూరంగా వెళ్లిపోతాయి. ఇంటి వద్ద అలాంటి ఏర్పాటు చేసుకుంటే.. పావురాలను అడ్డుకోవచ్చు. పాత సీడీలు, చిన్నచిన్న అద్దాలు, అల్యూమినియం ఫాయిల్స్పై ఎండ పడేలా బాల్కనీల్లో వేలాడదీయాలి. అవి గాలికి అటూఇటూ ఊగినప్పుడు.. వాటిపై రిఫ్లెక్షన్ వచ్చి, పావురాలను తరిమేస్తాయి.
ఇక గద్దలు, ఇతర పక్షులకు పావురాలు భయపడుతాయి. ఆయా పక్షుల ప్లాస్టిక్ బొమ్మలను బాల్కనీ, టెర్రస్, రూఫ్ టాప్పైన ఉంచితే.. వాటిని చూసి పావురాలు బెదిరిపోతాయి. అక్కడికి రావడం తగ్గిస్తాయి.