PF | న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరిన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. గృహ, వివాహ, విద్య సంబంధిత అవసరాల కోసం ఉపసంహరణల పరిమితిని సడలించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ నిబంధనలు ఎప్పటినుంచి అమలులోకి వస్తాయో తెలుపలేదు. ‘పీఎఫ్ ఖాతాలో సభ్యులుగా ఉన్నవారిపై పరిమితులు విధించాలనుకోవడం లేదు.
అది వారి డబ్బు. వారి అవసరాల కోసం ఆ డబ్బును ఎలాగైనా వినియోగించుకొనే స్వేచ్ఛ వారికుండాలి’ అని ఓ అధికారి పేర్కొన్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ సభ్యులు 58 ఏండ్ల వయసులో రిటైర్మెంట్ అనంతరం తమ మొత్తం నిధిని విత్డ్రా చేసుకోవచ్చు. లేదా రెండు నెలలకన్నా ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నా కూడా మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు.
ప్రత్యేక పరిస్థితుల్లో పాక్షిక మొత్తాన్ని విత్డ్రా చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఏడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సభ్యుడు తమ లేదా తమ పిల్లల వివాహం కోసం తమ మొత్తం పీఎఫ్ నుంచి 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మారనున్న నిబంధనల ప్రకారం ప్రతి పదేండ్లకోసారి సభ్యుడు మొత్తం పీఎఫ్ నిధిని లేదా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకొనేందుకు అనుమతించనున్నారు. దీనివల్ల దిగువ, దిగువ మధ్యతరగతి వర్గాల వారి ఆర్థిక అవసరాలు తీరుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.