బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలంటే.. సిబిల్ స్కోర్ బాగుండాలి. దాని ఆధారంగానే లోన్ అమౌంట్, వడ్డీ రేట్లు నిర్ణయం అవుతాయి. అయితే, పర్సనల్ లోన్ కావాలంటే.. సిబిల్ స్కోర్‌తోపాటు మరికొన్ని అంశాలూ కీలకపాత్ర పోషిస్తాయి. స్థిరమైన ఆదాయం, అప్పులు-ఆదాయం మధ్య వ్యత్యాసం, సరైన డాక్యుమెంట్లు, ఎంప్లాయిమెంట్ హిస్టరీతోపాటు పూచీకత్తు ఉన్నప్పుడే.. లోన్ మంజూరవుతుంది.
సిబిల్ స్కోర్: మంచి క్రెడిట్ హిస్టరీ, ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే.. పర్సనల్ లోన్ త్వరగా దొరుకుతుంది. అందుకే, సిబిల్ స్కోర్ 750 కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఎంప్లాయ్మెంట్ హిస్టరీ: సుదీర్ఘమైన ఉద్యోగానుభవం కూడా లోన్ పొందేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. మీరు ఎంత ఎక్కువ కాలం నుంచి ఉద్యోగం చేస్తుంటే.. రుణదాతల్లో అంత నమ్మకం పెరుగుతుంది. తరచూ ఉద్యోగాలు మారుతూ ఉంటే.. మీకు కుదురు లేదని రుణదాతలు అభిప్రాయ పడవచ్చు.
అప్పులు-ఆస్తులు: మీకు ఇప్పటికే ఉన్న అప్పులు, ఆస్తుల మధ్య తేడా.. తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆస్తుల కన్నా అప్పులే ఎక్కువగా ఉంటే.. రుణాలు రావడం కష్టంగా మారుతుంది.
పూచీకత్తు: మీ బ్యాంక్ సేవింగ్స్, ఆస్తులను పూచీకత్తు కింద పెడితే.. లోన్ ఇట్టే మంజూరు అవుతుంది. అయితే, మీరు కుదువ పెట్టే ఆస్తులు.. మీరు తీసుకునే రుణం కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడే.. అప్పు పుడుతుంది.
ఆన్‌టైమ్ రీపేమెంట్: మీ క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్, ఈఎంఐలను సరైన సమయానికే చెల్లిస్తున్నారా? అయితే, మీకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతాయి. అలాగని పరపతికి మించి రుణాలు తీసుకుంటే.. వాయిదాలు సరైన సమయంలో చెల్లించినా, ఒక దశకు వచ్చాక మీకు కొత్త రుణం పుట్టకపోవచ్చు. అందుకే, శక్తికి మించి రుణాలొద్దు!