Komatireddy Venkat Reddy | మిర్యాలగూడ, సెప్టెంబర్ 23: యూరియా కోసం జరిగిన ఆందోళన పాల్గొన్న పాపానికి ఓ గిరిజన ఆటోడ్రైవర్‌ను పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇంట్లో నిద్రిస్తున్నోడిని కులం పేరుతో దూషిస్తూ ఠాణాకు లాక్కెళ్లి కాళ్లు కట్టేసి.. లాఠీలతో బాదారు. భర్త జాడ చూపాలని.. కొట్టవద్దని అతడి భార్య కాళ్లావేళ్లాపడి బతిమిలాడినా కనికరించలేదు. ఈ ఘటనలో యువకుడి కాలు ఫ్రాక్చర్ అయినా నొప్పి తగ్గేందుకు గోలీలిచ్చి కోర్టుకు తీసుకెళ్లారు. దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో గిరిజన యువకుడిపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఘటన కలకలం లేపింది. ఇదే మండలంలోని కొత్తపేట తండాకు చెందిన సాయిసిద్ధును పోలీసులు సంబంధంలేని కేసులో ఇరికించి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కొట్టడం పై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. జరిగిన దారుణంపై బాధితుడు మంగళవారం మీడియా ఎదుట వివరాలు వెల్లడిస్తూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.
సాయిసిద్ధు కొత్తపేట తండాలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల కోసం యూరియా తెచ్చేందుకు ఈ నెల 3న మిర్యాలగూడ వెళ్లాడు. ఎరువులు అందుబాటులో లేక పట్టణంలోని చింతపల్లి రోడ్డుపై రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నాడు. సాయిసిద్ధును గుర్తించిన వాడపల్లి పోలీసులు అదును కోసం వేచి చూశా రు. ఈ క్రమంలో తండాలో సాయిసిద్ధు తన అన్నను కొంతమంది కొట్టగా తిరగబడ్డాడు. ఈ విషయంలో రెండువర్గాల వారు కేసులు పెట్టుకున్నాయి. అప్పటికే యూరియా ధర్నా లో పాల్గొన్నాడని కేసు నమోదు చేసిన పోలీసులు, ఈనెల 9న ఇంట్లో నిద్రిస్తున్న సాయిసిద్ధును కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అతడి భార్య బతిమిలాడినా పట్టించుకోలేదు. ఎస్సై సహా ఇద్దరు కానిస్టేబుళ్లు ఠాణాలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. భార్య భూమిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త ను చూపాలని కోరినా పట్టించుకోలేదు. ఈ ఘటనపై బాధితుడి భార్య, న్యాయవాది కలిసి ఈనెల 15న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పనిచేసిన సమయంలో ఓ రైతును స్టేషన్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్టు ఆరోపణలున్నాయి. తాజా గా వాడపల్లిలోనూ అదే విధమైన ఆరోపణ లు రావడం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా ఎవరినీ కొట్టలేదని సదరు వ్యక్తిపై నమోదైన కేసులో జైలుకు మాత్రమే పంపామని పేర్కొన్నారు.
యూరియా కోసం ఆందోళనలో పాల్గొన్నందుకు తండాలో జరిగిన ఘర్షణను సాకు గా చూపుతూ తనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు సాయిసిద్ధు ఆవేదన వ్యక్తంచేశాడు. జైలు నుంచి విడుదలైన అనంతరం మిర్యాలగూడలో మంగళవారం మీడియాతో మా ట్లాడుతూ వాడపల్లి పోలీసులు కావాలనే తనను టార్గెట్ చేసి గొడవ కేసును సాకుగా చూపి స్టేషన్‌కు లాక్కెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కన్నీటిపర్యంతమయ్యాడు. యూరి యా ధర్నాలో పాల్గొంటావా? అంటూ తీవ్రంగా కొట్టడంతో కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసి జడ్జి ఎదుట హాజరు పరిచారని, స్టేషన్లో కొట్టిన విషయం జడ్జికి చెప్తే బెయిల్ రాకుండా చేస్తామని బెదిరించారని వాపోయాడు. న్యాయమూర్తి వద్ద హాజరుపర్చగా జరిగిన విషయాన్ని వివరించాననీ, ఈ విషయాన్ని జడ్జి ఎదుట చెప్పి నొప్పి తగ్గేందుకు ఇచ్చిన మాత్రలను చూపించానని దీంతో జడ్జి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సకు సిఫారసు చేశారని వివరించాడు.