ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్లో ఈ లక్షణాలతో కూడిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే వర్షాకాలంలో ఏర్పడే వాతావరణ మార్పుల కారణంగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా హెచ్3ఎన్2 ఉపరకానికి చెందిన ఇన్‌ఫ్లూయెంజా…. పంజా విసురుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో సతమతమవుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది ఇన్‌ఫ్లూయెంజా బాధితులే. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో దీనిప్రభావం అధికంగా ఉంటుంది. అయితే ఈ ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలేంటి, ఇది రావడానికి గల కారణాలు, దీనికి అందుబాటులో ఉన్నచికిత్స, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
సాధారణంగా వర్షాకాలంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల వాతావరణంలోని వైరస్లు చురుకుగా మారి గాలిలో తేలుతుంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్లు సులభంగా మన శరీరంలోకి ప్రవేశించి ప్రభావం చూపుతాయి. ఫలితంగా ఆయా వైరస్‌లతో కూడిన జ్వరాలు, జబ్బులు వస్తాయి. ఇన్ఫెక్టెడ్ రోగి తుమ్మినప్పుడు గాని, దగ్గినప్పుడు గాని ఆ వ్యక్తి నోటి తుంపర్ల నుంచి వచ్చే వైరస్ ఎక్కువ దూరం వ్యాప్తి చెందుతుంది. దీంతో ఒకరి నుంచి మరొక్కరికి సులభంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. దీంతో ఒక ఇంట్లో వైరల్ ఫీవర్స్ వచ్చాయంటే వెంట వెంటనే పొరుగిళ్లలోని వారికి కూడా అంటుకునే అవకాశం ఉంటుంది.
డెంగ్యూ, చికున్‌గున్యా వంటి విష జ్వరాలతో పోల్చితే ఇన్‌ఫ్లూయెంజా పెద్ద ప్రమాదకరం కాదు. కానీ, సకాలంలో చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఇన్‌ఫ్లూయెంజా అనేది కరోనా తరహాలోనే అంటు వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా రెండు రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు సీజనల్‌గా ప్రభావం చూపుతుంటాయి. అంటే వర్షాకాలం, శీతాకాలంలో ఎ, బి అనే రకానికి చెందిన ఇన్‌ఫ్లూయెంజా వైరస్లు జనంపై ప్రభావం చూపుతాయి.
ఎ-రకం ఇన్‌ఫ్లూయెంజా: ఇది వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ ఫ్లూ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
బి-రకం ఇన్‌ఫ్లూయెంజా: ఇది కూడా చల్లటి వాతావరణంలో అంటే వానాకాలం, చలికాలంలోనే ప్రభావం చూపుతుంది. దీని లక్షణాలు కూడా దాదాపు ఎ-రకం ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలనే పోలి ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో ఎ, బి రకం ఫ్లూలే అధికంగా వస్తుంటాయి.
సాధారణంగా ఇన్‌ఫ్లూయెంజా అనేది ఎవరికైనా వచ్చిపోతుంది. కానీ, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో మాత్రం ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, షుగర్, టీబీ, హెచ్ఐవీ, టీబీ, ఆస్తమా, లంగ్ ఇన్ఫెక్షన్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి. సింప్టమ్యాటిక్ ట్రీట్‌మెంట్‌తోనే తగ్గినప్పటికీ సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే వైరస్ అనేది గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా ప్రధాన అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకని సీజన్లలో వచ్చే జ్వరాలను ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెంజా లాంటి జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవడం శ్రేయస్కరం.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఈ ఫ్లూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇన్‌ఫ్లూయెంజా వల్ల న్యుమోనియా ఎటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. న్యుమోనియా వచ్చి ఊపిరితిత్తులు మొత్తం ఇన్ఫెక్ట్ అవుతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటమే కాకుండా సకాలంలో సరైన చికిత్స అందించకపోతే పరిస్థితి చేయిదాటవచ్చు. ప్రతి 10 మంది ఇన్‌ఫ్లూయెంజా బాధితుల్లో ఇద్దరు న్యుమోనియాకు గురవుతుంటారు. అందుకని ఈ వైరస్‌ను తేలికగా తీసుకోకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇన్ఫ్లూయెంజాను నిర్ధారించేందుకు త్రోట్ స్వాబ్ పరీక్ష చేస్తారు. దీని ద్వారా వచ్చింది ఏ రకమైన వైరసో కూడా గుర్తించవచ్చు.
సీజనల్ వ్యాధులకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ ఉండదు. లక్షణాల ఆధారంగా ట్రీట్మెంట్ అందిస్తారు. జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలకు సంబంధిత ఔషధాలను సిఫారసు చేస్తారు. మూడు నాలుగు రోజులైనా లక్షణాలు తగ్గకపోతే అప్పుడు యాంటి బయాటిక్స్ ఇస్తారు. నీరసంగా ఉన్న రోగులకు ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. సకాలంలో చికిత్స తీసుకున్నట్లయితే లక్షణాల తీవ్రతను అరికట్టవచ్చు. దీని వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. నిర్లక్ష్యం చేస్తే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని మర్చిపోవద్దు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాజారావు
జనరల్ ఫిజీషియన్
ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజి
హైదరాబాద్