వంద మందుగోళీలకు కొరుకుడుపడని రోగం.. ఒక్క శస్త్రచికిత్సకు లొంగుతుంది. ఆ ఆపరేషన్ హస్తవాసి గల వైద్యుడు చేస్తే.. ఏ పరేషానూ ఉండదు. అన్ని రంగాల్లోనూ సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీలు వైద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ రోబోటిక్ సర్జరీలు ఏయే చికిత్సల్లో చేస్తారు? దీనివల్ల రోగులకు, వైద్యులకు కలిగే లాభాలేంటి? ఓపెన్ సర్జరీలు, ల్యాపరోస్కోపిక్ పద్ధతిన చేసే సర్జరీలకు రోబోటిక్ పద్ధతిలో జరిపే సర్జరీలకు గల తేడా ఏంటి? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
సాధారణంగా ఏదైన జబ్బు చేసినప్పుడు మొదట ఔషధాలతో చికిత్స అందిస్తారు. కొన్ని రకాల రుగ్మతలకు అంటే క్యాన్సర్ లాంటి వ్యాధులకు, శరీరం లోపల ఏర్పడిన గడ్డలు లేదా కణితులకు, కిడ్నీ, కాలేయం, గుండె తదితర సమస్యలున్న రోగులకు చాలా సందర్భాలలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. గతంలో ఈ ఆపరేషన్ల కోసం రోగి శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టి సర్జరీ చేసేవారు. దీనివల్ల రోగికి తీవ్రమైన నొప్పి కలిగేది. అంతేకాదు శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యేది. అందుకని ఆపరేషన్ ఉందంటే ముందుగానే బ్లడ్ యూనిట్లు అందుబాటులో ఉంచుకోవాలని రోగి కుటుంబ సభ్యులకు సూచించేవారు వైద్యులు. సర్జరీ తరువాత శరీరంపై కోత పెట్టిన ప్రదేశంలో ఏర్పడే మరక జీవితాంతం ఉండిపోయేది. అంతే కాకుండా రోగి కోలుకునేందుకు రోజులు, వారాల సమయం పట్టేది. రోజుల తరబడి రోగి దవాఖానలో ఉండాల్సి వచ్చేది. ఈ కారణంగా రోగితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా పనులు మానుకుని దవాఖాన చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇలా రకరకాల ఇబ్బందులు ఉండేవి. కాలక్రమంలో వైద్య రంగంతోపాటు శస్త్రచికిత్సా పద్ధతుల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పది, పదిహేను సంవత్సరాల క్రితం ల్యాపరోస్కోపీ విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆపరేషన్ సమయంలో పెద్ద పెద్ద కోతల నుంచి ఉపశమనం లభించింది. కేవలం శరీరంపై చిన్నపాటి రంధ్రాలు చేసి వాటి ద్వారా వైద్య పరికరాలను పంపించి ఆపరేషన్లు చేయడం మొదలైంది. అయితే ఈ విధానం అన్ని రకాల చికిత్సలకు, అన్ని సందర్భాలలో సాధ్యం కాదు. ఇదిలా ఉండగా తాజాగా రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.
ఈ రోబోటిక్ అనేది శస్త్రచికిత్సల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. పాతకాలం నాటి ఓపెన్ సర్జరీల వల్ల రోగం నయమైనప్పటికీ సర్జరీ వల్ల చేసిన గాయం మానడానికి సమయం పట్టేది. ఇందులో నొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఓపెన్ సర్జరీలో ఆపరేషన్ తరువాత కుట్లు వేస్తారు. ఆ కుట్లు ఆరడానికి కొంత సమయం పట్టేది. కొంతమందిలో కుట్లు వేసిన ప్రదేశంలో చీము పట్టడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు తలెత్తేవి. అంతేకాకుండా రోగి కట్లు విప్పడానికి మరోసారి దవాఖానకు రావల్సి వచ్చేది. ఈ విధంగా ఓపెన్ సర్జరీల్లో రోగి కోలుకునేందుకు కొంత సమయం పట్టేది. అదే ల్యాపరోస్కోపిక్ పద్ధతిలో అయితే శరీరంపై పెద్ద పరిమాణంలో కోత పెట్టడం తప్పింది. చిన్నపాటి రంధ్రాలు చేసి వాటి ద్వారానే రోగికి సర్జరీ చేస్తారు. దీని వల్ల రక్తస్రావం సమస్య ఉండదు. ముఖ్యంగా రోగి త్వరగా కోలుకోవడమే కాకుండా నొప్పి కూడా పెద్దగా ఉండదు.
ల్యాపరోస్కోపీ పద్ధతిలో సర్జరీలను చేతితో చేసినంత సులభంగా చేయలేం. చేతివేళ్లకు ఉన్న వెసులుబాటు ల్యాపరోస్కోపీ పరికరాలకు ఉండదు. కొన్ని రకాల కోణాల్లో ల్యాపరోస్కోపీ పరికరాలు తిరగవు. ఉదాహరణకు పెల్విక్ రీజన్ అనేది చాలా ఇరుకుగా ఉంటుంది. ఇందులో ల్యాపరోస్కోపీతో సర్జరీ చేయాలంటే 5నుంచి 6 గంటల సమయం పడుతుంది. అదే కాలేయ మార్పిడి సర్జరీకి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఈ సర్జరీలు చేసే సమయంలో సర్జన్లు గంటల తరబడి నిల్చుని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది.
ల్యాపరోస్కోపీ పద్ధతిలో శస్త్రచికిత్సలు చేసినప్పుడు వైద్యులు గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. దీనివల్ల వైద్యుడి భుజాలు, వెన్ను, మెడపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఫలితంగా జాయింట్ పెయిన్, భుజాల నొప్పి, కాళ్లల్లో వారికోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు వైద్యులను పీడిస్తాయి. ఇలాంటి పరిస్థితులను రోబొటిక్ పద్ధతుల ద్వారా అధిగమించవచ్చు.
రోబోటిక్ పద్ధతిలో రోబో యంత్రానికి ఆర్మ్స్ ఉంటాయి. అది యంత్రం కనుక అలసిపోదు. ఎంతసేపైనా ఏ పొజిషన్లో అయినా ఉండగలదు. అదే వైద్యులు గంటల సమయం పాటు ఒకే పొజిషన్లో ఉండలేరు. సర్జరీ సమయంలో రోగి శరీరంపై చిన్న చిన్న రంధ్రాలు చేసి రోబో పరికరాలను అమర్చడం జరుగుతుంది. ఆ తరువాత రోబో కంట్రోల్ అనేది వైద్యుడి చేతిలో ఉంటుంది. వైద్యుడు కుర్చీలో కూర్చుని సులభంగా రోబోను ఆపరేట్ చేస్తూ సర్జరీ నిర్వహిస్తాడు. వైద్యుడు తన చేతితో కంట్రోలర్‌ను ఎలా తిప్పితే రోగి శరీరంలో అమర్చిన రోబో ఆర్మ్స్ అలా తిరుగుతాయి. దీనివల్ల వైద్యులు ఎలాంటి శారీరక ఒత్తిడీ లేకుండా సునాయాసంగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు.
