హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రైల్వే శాఖలో గత మూడేండ్లలో ఎన్ని ఖాళీలను భర్తీ చేశారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించారు. మూడేండ్ల కాలంలో రైల్వేశాఖ భర్తీ చేసిన ఉద్యోగాలెన్ని? ఉద్యోగాల భర్తీకి చేపడుతున్న చర్యలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఏయే జోన్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? అని ప్రశ్నించారు. దీనికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ఉద్యోగ ఖాళీలకు అనుగుణంగా భర్తీ చేపడుతున్నామని చెప్పారు. మూడేండ్ల కాలంలో 2,94,687 పోస్టులు నోటిఫై చేసి, అందులో 1,53,974 పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. మరో 1,40,713 పోస్టులభర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. ఇప్పటికే తాము అన్ని వివరాలను పార్లమెంట్‌కు సమర్పించామని చెబుతూనే జోన్ల వారీగా మూడేండ్ల కాలంలో చేపట్టిన నియామకాలను మంత్రి వివరించారు.