హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : భవిష్యత్తులో సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కానున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రీకరణ పెద్దస్థాయి వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాకుండా, కూరగాయల సాగు, పండ్ల తోటల్లోనూ విస్తృతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులకు అధిక ఉత్పాదకత, తకువ శ్రమతో స్థిరమైన సాగు పద్ధతులను అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆధునిక ప్లాంటర్లు, ట్రాన్స్ప్లాంటర్లతో నాట్లు వేగంగా జరుగడంతో రైతుల శ్రమ తగ్గి దిగుబడి పెరుగుతుందని చెప్పారు. యాంత్రిక వీడర్లు, పవర్టూల్స్ ద్వారా కలుపు నియంత్రణ సులభతరం అవుతుందని, రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. ప్రెసిషన్ స్ప్రేయర్లు, డ్రోన్ల వినియోగంతో ఎరువులు, పంట సంరక్షణ మందులు ఆశించిన స్థాయిలో పిచికారీ చేయనున్నట్టు, దీంతో వృథా తగ్గి పర్యావరణానికి రక్షణ లభిస్తుందని రాజిరెడ్డి తెలిపారు. స్మార్ట్ సెన్సర్లు, డ్రోన్లు, డిజిటల్ పరికరాలతో పంట పెరుగుదల, నేల ఆరోగ్యం, చీడపీడల సమాచారం అందనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో యంత్రాల కంపెనీ ప్రతినిధి త్రివిక్రమ్ పలు రోబోటిక్ మెషినరీ ప్రదర్శించి పని తీరును వివరించారు.