హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణలో ఓ కమిషనరేట్‌కు అతనొక కమిషనర్ ఆఫ్ పోలీస్. వృత్తిపరంగా, ఆ సీపీ మంచివాడే అయినప్పటికీ వారింట్లో పనిచేయాలంటేనే హోమ్‌గార్డులు, కానిస్టేబుళ్లు బెంబేలెత్తిపోతున్నారు. సీపీ సతీమణి తీరువల్ల ఆ ఇంట్లో పనంటేనే భయపడిపోతున్నారు. ఆయనకు పెండ్లయిన దగ్గర్నుంచి.. విధులు నిర్వర్తించిన ప్రతీచోటా 20 మంది బాధితులు ఉన్నట్టు చెప్తున్నారు. ఆ ఇంట్లో పనిచేస్తున్న ఓ హోమ్‌గార్డు.. ‘అన్నా ఇక నాకు చావు తప్ప ఏం లేదు. నేను డిగ్రీపైన చదువుకున్నా. ఉన్నత చదువులు చదివా. హోమ్‌గార్డుగా ఇండ్లలో పని చేయమంటే మొదట మనసు ఒప్పలేదు. అయినా సరే డ్యూటీ ఫస్ట్ అనే భావనతో ఆ ఇంట్లో పనికి వెళ్తున్నా. అయితే, ఆ మేడమ్ మెంటాలిటీ వేరే ఉన్నది. ఆమె కూడా ఓ ఉన్నతాధికారి బిడ్డ. ఇంట్లో ఆమెదే డామినేషన్. ఆమె చెప్పినమాట భర్తగా, సీపీగా ఆయన తీసేయలేడు. అందుకే మాతో ఇంటిపని, గార్డెన్ పని, వంట పనులు, గిన్నెలు తోమించడం వంటివన్నీ చేయిస్తున్నారు’ అంటూ భోరున విలపించాడు.
పోలీసుశాఖలోని ఈ ఆర్డర్లీ వ్యవస్థతో హోమ్గార్డ్స్, కానిస్టేబుళ్లు ఎంతలా బాధపడుతున్నారనేదానికి సీపీ భార్య ప్రవర్తనే నిదర్శనమని హోమ్‌గార్డులు చెప్తున్నారు. వెట్టిచాకిరీకి భయపడి ఎప్పుడైనా ఒకరోజు డ్యూటీ మానేస్తే.. అధికారుల నుంచి నోటీసులు ఇప్పిస్తున్నారని బాధపడుతున్నారు. హోమ్‌గార్డు ఉద్యోగం నుంచి తీసేయిస్తామని బెదిరింపులు నిత్యకృత్యం అయ్యాయని మధనపడుతున్నారు. ఆ జోన్ పరిధిలోని ఇద్దరు ఎస్పీల దగ్గర కూడా దుర్భర పరిస్థితుల్లో పనులు చేస్తున్నామని హోమ్‌గార్డులు, కానిస్టేబుళ్లు చెప్తున్నారు. ఉద్యోగం లేకపోతే ఇంట్లో వాళ్లు రోడ్డున పడతారేమోననే భయంతో ఓర్చుకొని పనులు చేస్తున్నా.. కనికరం లేకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. కొంతమంది ఐపీఎస్‌ల ఇండ్లలో పనిచేసే హోమ్‌గార్డులు సైతం మానసిక వేదనకు గురవుతున్నామని చెప్తున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని, వారికి కోపం వస్తే ఉద్యోగాలు తొలగిస్తారేమోనని భయం వెంటాడుతున్నదని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవు ఇవ్వని కర్కోఠక అధికారులు ఉన్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏదైనా శుభకార్యాలకు వెళ్లాలన్నా భయంతో జంకుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ ఈ వెట్టిచాకిరీపై విచారణ చేసి ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు కృషి చేయాలని వేడుకుంటున్నారు.