భద్రాద్రి జిల్లాలో ఈ ఏడాది వానకాలం వరి సాగు బాగా తగ్గింది. ఇందుకు ఎల్‌నినో ప్రభావం కారణమని స్పష్టమవుతోంది. వర్షాలు తక్కువగా కురవడంతో అధికారుల సాగు అంచనా సైతం తలకిందులైంది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది 5,08,604 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది 4,15,420 ఎకరాలకే పరిమితమైంది. ఇందులో వరిసాగు గత ఏడాది 1,69,253 ఎకరాల్లో సాగు అవ్వగా.. ఈ ఏడాది కేవలం 89,975 ఎకరాల్లోనే సాగవుతున్నది. అంటే ఈ వానకాలం భారీగా 79,278 ఎకరాల వరిసాగు తగ్గింది.
-అశ్వారావుపేట, ఆగస్టు 19
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్రత కూడా తగ్గడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు వ్యవసాయాధికారులు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించడంతో వరిసాగు చేసే రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. అధికారుల ముందస్తు ప్రణాళిక ప్రకారం పంటల సాగు అంచనా సైతం తప్పింది. వర్షాకాలంలో వ్యవసాయాధికారులు వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు లక్ష్యాలను ఖరారు చేస్తారు. ఈ ఏడాది కూడా 4,15,420 ఎకరాల్లో అన్నిరకాల పంటలు సాగు అవుతాయని అంచనాతో ప్రణాళిక ఖరారు చేశారు. ఇందులో వరిసాగు 1,69,253 ఎకరాలు సాగు అవ్వొచ్చని అంచనా వేస్తే ఎల్‌నినో ప్రభావంతో సాగుకు రైతులు వెనుకడుగు వేశారు. ఫలితంగా ఈ నెల 15వ తేదీతో వరినాట్లు పూర్తికావాల్సి ఉన్నప్పటికీ ఆదివారం నాటికి కేవలం 89,975 ఎకరాల్లోనే వరిసాగు పూర్తయ్యిందని వ్యవసాయ శాఖాధికారులు నిర్ధారించారు. ఈ లెక్కన సుమారు 79,278 ఎకరాల్లో వరిసాగు తగ్గిందని స్పష్టమవుతోంది. తగ్గిన వరిసాగు ప్రభావం ధాన్యం, బియ్యం ధరల పెంపుపై పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన వ్యవసాయ శాఖాధికారులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఆయిల్‌పాం, కూరగాయల సాగు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకున్న రైతులు కూడా వర్షాధార, సంప్రదాయ పంటలను వదిలేశారు. కొందరు రైతులు అసలు పంటల సాగు పట్ల ఆసక్తి చూపలేదు. దీంతో సాగు లక్ష్యం గణనీయంగా తగ్గిపోయింది.

వర్షాకాలంలో వ్యవసాయాధికారులు ఖరారు చేసిన పంటల సాగు అంచనా ప్రణాళిక క్షేత్రస్థాయిలో తలకిందులైంది. గత ఏడాది 5,08,604 ఎకరాల్లో అన్నిరకాల పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో అంచనాను 4,15,420కి కుదించారు. అంటే.. గత ఏడాది కంటే 93,184 ఎకరాల సాగు తగ్గుతుందని అంచనా వేశారు. వ్యవసాయశాఖ ప్రణాళిక ప్రకారం వరి సాగు 1,69,253 ఎకరాలకు గాను.. కేవలం 89,975లకే తగ్గిపోయింది. ఈ లెక్కన 79,278 ఎకరాల వరిసాగు పడలేదు. ఇతర పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది వరి సాగు వదిలేశాను. నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి ఏటా వరి సాగు చేస్తుంటాను. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయని అధికారులు, ఇతర ప్రచార మాధ్యమాల్లో తెలుసుకున్నాను. అందుకే ఈ ఏడాది వరి పంట సాగు చేయలేదు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించాము. రైతులు కూడా వర్షాభావ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. అందుకే వరి సాగు తగ్గింది.