Arvind Kejriwal : ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సత్తా ఉంటే తక్షణం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడ్డ అనంతరం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో అధికారం చేపట్టిన బీజేపీ ఈ ప్రాంతాన్ని సమస్యల్లో నెట్టిందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ఢిల్లీని బీజేపీ నాశనం చేసింది. ఇక్కడ అధికారం చేపట్టాలనే ఆశతో మూడు కోట్ల ఢిల్లీ ప్రజల్ని ఇబ్బందుల్లో నెట్టారు. కావాలంటే ఢిల్లీ ప్రజల్ని వెళ్లి అడగండి. ఢిల్లీలో వాయు కాలుష్యం, యమునా నది కాలుష్యం, రోడ్లు ధ్వంసం సహా అనేక సమస్యలున్నాయి. నేను ఈ రోజు మోదీకి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు సత్తా ఉంటే ఢిల్లీకి మళ్లీ ఎన్నికలు నిర్వహించండి. బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటా. ఢిల్లీ ప్రజలు మీ పాలనతో విసిగిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీని అధికారం నుంచి తొలగించేందుకు దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుట్రకు బీజేపీ తెరలేపింది. దేశంతో, రాజ్యాంగంతో ఆటలాడుకున్నారు.
మోదీ దేశవ్యాప్తంగా 5,000 స్కూళ్లు నిర్మిస్తే , నేను ఢిల్లీలో 500 స్కూళ్లు కట్టా. మీరు (మోదీ) మా మీద ఎన్నో కుట్రలు చేశారు. ఈడీ, సీబీఐ, పోలీసులు, ఐటీ సహా అందరినీ మాకోసం వాడారు. జైలుకు కూడా పంపారు. కేజ్రీవాల్‌ను ఇవేవీ ఆపలేవు. చావు ఒక్కటే ఆపగలదు. ఎందుకంటే నన్ను ఏదీ, ఏమీ చేయలేదు. మోదీకి సత్తా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గరనుంచి నేను కనిపించడం లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అందరిలాంటి రాజకీయ నాయకుడిని కాదు. నిజాయితీ గల మనిషిని. అందుకే మౌనంగా ఉన్నా. నా నిజాయితీ నిరూపితమైన తర్వాతే మాట్లాడాలని నిశ్చయించుకున్నా’’ అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు. ఆయన వెంట మనీష్ సిసోడియా సహా పలువురు ఆమ్ ఆద్మీ నేతలున్నారు.