హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్ సిటీలో పరిచిన గడ్డిని తీసి మరోచోటికి తరలించేందుకు హెచ్ఎండీఏ ఏకంగా రూ.75లక్షలు ఖర్చు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయమై టెండర్లు పిలిచే పనులు చేపట్టామని కొందరు అధికారులు బుకాయించే ప్రయత్నం చేస్తుండగా, పరిచిన గడ్డిని తీసి ప్రజాభవన్‌కు తరలించడానికి అంత ఖర్చు ఎందుకని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా, గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం ఊదరగొట్టక, తాత్కాలిక ఏర్పాట్లకు హెచ్ఎండీఏ కోట్ల ప్రజాధనం వృథా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుంటూనే, టెండర్ల మాటున అందినకాడికి గుంజేందుకు కొందరు ఉన్నతాధికారులు అవకాశాలు వెతుకుతున్నారనే ఆరోపణలూ గుప్పుమంటున్నాయి.
డిసెంబర్ నెలలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో గ్రీనరీ పెంపునకు హెచ్ఎండీఏ కోటిన్నర ఖర్చుతో మెరుగులు అద్ది, నడిచే మార్గాల్లో గ్రాస్మ్యాట్ల కోసం భారీగా ఖర్చు చేసిన విషయం తెలిసిందే. సమ్మిట్ ముగియడంతో వేసిన మ్యాట్లను తిరిగి డిప్యూటీ సీఎం భట్టి (ప్రజాభవన్) నివాసానికి తరలించేందుకు ఇప్పుడు మరోసారి టెండర్లు పిలవడమే తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయమై అటు హెచ్ఎండీఏ అధికారులు, ఇటు ప్రభుత్వ నేతలు స్పందించకపోవటంతో టెండర్ల మాటున ప్రజాధనం దుర్వినియోగం అనే చర్చ నడుస్తున్నది. గడ్డి పరుచడానికి, దానిని తీయడానికి లక్షల ప్రజాధనం దుబారాపై ఎక్స్ వేదికగా నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీలో లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా ఈ విభాగంలో జరిగిన కాంట్రాక్టులన్నీ లోపాభూయిష్టం అనే విమర్శలు వస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ గ్రీనరీపై పరిమితికి మించి ఖర్చు పేరిట హెచ్ఎండీఏ నిధులు చేతులు మారినట్టుగా అధికారుల్లో చర్చ జరుగుతున్నది. కాగా, అడ్డగోలుగా సాగుతున్న పలు టెండర్లతో ఇప్పటివరకు రూ.25కోట్లకు పైగా పనులు చేపట్టినట్టుగా లెక్కలు చూపుతూ, సగం పనులు కూడా కాకుండానే చెల్లింపులు జరిగాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. పాలిథీన్ కవర్లు మొదలు ప్లాస్టిక్ టబ్బుల వరకు అన్నింట్లో అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలోని కొందరు అధికారులు వాటాలతో జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ తాత్కాలిక ఏర్పాట్లకు కోట్ల ప్రజాధనం వృథాపై నెటిజన్లు మండిపడుతున్నారు.