హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): నకిలీ పురుగు మందుల వినియోగం, విక్రయాలపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకున్నది. నకిలీ పురుగు మందులు అమ్మిన వారికి రూ.50 లక్షల వరకు జరిమా నా లేదా ఐదేండ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపింది. నకిలీ పురుగు మందులు వినియోగించడం వల్ల పంటలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. నష్టాలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించింది. నకిలీ పురుగు మందుల బెడదను అరికట్టడానికి, రైతుల మేలుకు ‘పురుగు మందుల నిర్వహణ బిల్లు-2025 ముసాయిదాను విడుదల చేసినట్టు వెల్లడించింది. ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు ఫిబ్రవరి 4లోపు పంపాలని కోరినట్టు వెల్లడించింది.
వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ పురుగు మందుల నిర్వహణ బిల్లు-2025 ముసాయిదాను రూపొందించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘కీటక నాశిని చట్టం-1968’, ‘కీటక నాశిని నియమాలు-1971’స్థానంలో ఈ కొత్త బిల్లు రానున్నది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పురుగు మందుల నియంత్రణ వ్యవస్థను మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం. కాగా, గత ఏడాది నిర్వహించిన రైతు సంప్రదింపుల కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పలు రాష్ట్రాల రైతులతో మాట్లాడగా, నకిలీ విత్తనాలు, పురుగు మందుల వల్ల దిగుబడి తగ్గి, జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నకిలీ పురుగు మందులపై కఠినమైన నిబంధనలు విధిస్తేనే వాటిని నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది.