ముంబై, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు మదుపరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,065.71 పాయింట్లు లేదా 1.28 శాతం పతనమై 83వేల మార్కుకు దిగువన 82,180.47 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 1,235.60 పాయింట్లు కోల్పోయింది. బీఎస్ఈలో నమోదైన షేర్లలో 3,503 నష్టపోగా, 780 లాభపడ్డాయి. మరో 119 యథాతథంగా ఉన్నాయి.
ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 353 పాయింట్లు లేదా 1.38 శాతం క్షీణించి 25,232.50 దగ్గర నిలిచింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఐరోపా దేశాలపై సుంకాల బెదిరింపులకు దిగుతుండటం, ఆయా దేశాలపై యుద్ధ సన్నాహాలు చేస్తుండటం వంటివి గ్లోబల్ మార్కెట్లను కుప్పకూల్చేస్తున్నాయి. ఈ ప్రభావం కూడా భారతీయ ఈక్విటీలపై సహజంగానే కనిపించింది. విదేశీ మదుపరులు అదేపనిగా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటం కూడా ఓవరాల్‌గా లాభాల స్వీకరణకు దారితీసింది.
సెన్సెక్స్ షేర్లలో..
సెన్సెక్స్ షేర్లలో ఎటర్నల్ అత్యధికంగా 4.02 శాతం నష్టపోయింది. ఆ తర్వాత బజాజ్ ఫైనాన్స్ (3.88 శాతం) పడిపోయింది. సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీం ద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లూ నిరాశపర్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ ఒక్కటే లాభాలను అందుకోవడం విశేషం. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 2.74 శాతం, మిడ్‌క్యాప్ 2.52 శాతం చొప్పున తగ్గుముఖం పట్టాయి. రంగాలవారీగా రియల్టీ 5.21 శాతం పడింది. అలాగే సేవలు, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం, ఆటో, విద్యుత్తు తదితర రంగాల షేర్లూ కోలుకోలేదు.
రూ.9.86 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలు.. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను కరిగించేశాయి. మంగళవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.9,86,093.96 కోట్లు ఆవిరైపోయింది మరి. దీంతో రూ.4,55,82,683.29 కోట్లకు పరిమితమైంది. సోమవారం కూడా సూచీలు నష్టాల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, చైనా, హాంకాంగ్ వంటి ప్రధాన దేశాల సూచీలన్నీ పడిపోయాయి. మరోవైపు ఐరోపా లోని ప్రధాన మార్కెట్లదీ ఇదే పరిస్థితి.
నష్టాలకు కారణాలు
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు
రూపాయి మారకం విలువ పతనం
తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు
మదుపరుల లాభాల స్వీకరణ
క్షీణించిన అంతర్జాతీయ మార్కెట్లు