మెహిదీపట్నం, నవంబర్ 29: చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా చార్మినార్, మొజంజాహి మార్కెట్‌తో పాటు అనేక పురాతన కట్టడాలను తీర్చిదిద్దిన ప్రభుత్వం తాజాగా లంగర్‌హౌస్ బాపూఘాట్‌లోని పురాతన బావిని పునరుద్ధరించింది. మరమ్మతులు చేసి సర్వాంగ సుందరంగా మార్చింది. సోమవారం రాత్రి ఈ పురాతన బావిని మంత్రి కేటీఆర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌లతో కలిసి పరిశీలించారు.
అనంతరం ఆ బావిలో రెండు తాబేళ్లను వదిలిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాల పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. నగరంలో పలుచోట్ల అభివృద్ధి చేసిన పురాతన బావులు, కట్టడాల సంరక్షణకు తీసుకున్న చర్యలపై బాపూఘాట్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. పురాతన కట్టడాల పరిరక్షణకు గండిపేట వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం ఖవ్వాలి ఆలకించిన ఆయన టీఆర్ఎస్ నేతలతో కలిసి సెల్ఫీలు దిగారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వి.నర్సింహ, కార్వాన్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఠాకూర్ జీవన్‌సింగ్, నాయకులు శేఖర్ రెడ్డి, గోవింద్రాజ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
చారిత్రక బాపూఘాట్ మెట్లబావి అద్భుత గానకచేరీకి వేదికైంది. సోమవారం రాత్రి నిర్వహించిన ఖవ్వాలి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ తిలకించి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం సంగీతకళాకారులను ఆయన అభినందించారు. అంతకుముందు లంగర్‌హౌస్ బాపూఘాట్లో పునరుద్ధరించిన పురాతన బావిని ఆయన మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్లతో కలిసి ప్రారంభించారు. బావిలో రెండు తాబేళ్లను వదిలిన మంత్రి కేటీఆర్ చారిత్రక కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.